కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినందుకా లేక బీడీ కార్మికులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చినందుకా అని ఆ పార్టీ నేతలు చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్, బీడీ కార్మికులకు పెన్షన్ పథకాల్లో కేంద్రం వాటా ఒక్కపైసా లేదని స్పష్టం చేశారు.
దేశంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఏనాడైనా బీడీ కార్మికులకు రూపాయి ఇచ్చరా అని ప్రశ్నించారు. అలా ఇస్తే ముక్కు నేలకు రాస్తానని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి ఇవాళ సిద్దిపేటలోని 8, 9, 12 వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సిద్దిపేట పట్టణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు.
గతంలో నీటికి ఇబ్బంది ఉండేదని.. ఇప్పుడు ఆ సమస్య లేదన్నారు. రూ.300 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేసుకున్నామని, 80 శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. ఖాళీ స్థలం ఉన్న వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉన్నామని వెల్లడించారు. కారు గుర్తుకు ఓటేసినప్పుడే హరీశ్ రావు, కేసీఆర్‌కు వేసినట్లని చెప్పారు. ఎవరు గెలిస్తే అభివృద్ధి జరుగుతుందో ప్రజలే ఆలోచించుకోవాలని సూచించారు. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.