తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది వారసులు వచ్చారు. వారసురాళ్లు మాత్రం చాలా తక్కువగా వచ్చారు. కానీ వారికి వారసులకు దక్కినంత ఆదరణ మాత్రం దక్కలేదు. దీంతో సక్సెస్ కాలేకపోయారు. కొంతమంది మాత్రం ఇప్పటికీ హీరోయిన్గా గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో మరో వారసురాలు వచ్చేస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయిపోయింది. ఈ క్రమంలో తాజాగా ఆమె చేసిన ఓ ఫొటోషూట్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. చీరకట్టులో అందర్నీ మాయ చేస్తోంది.

తెలుగు ఇండస్ట్రీలోకి ఇప్పటికే మంచు లక్ష్మి, నిహారిక, శివాత్మిక వంటి వారసురాళ్లు ఎంట్రీ ఇచ్చారు. కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఈ కోవలోనే యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా ఇప్పటికే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

2013లో విశాల్ హీరోగా వచ్చిన పట్టాత్తు యానాయ్ సినిమాతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రేమ బారాహ సినిమాతో కన్నడ ప్రేక్షకులనూ పలకరించింది. తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేసిన ఐశ్వర్యకు సరైన బ్రేక్ మాత్రం దక్కలేదు. దీంతో ఇప్పుడు టాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటుంది అర్జున్ కూతురు.

స్వీయ దర్శకత్వంలోనే కూతుర్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలని అనుకుంటున్నాడు అర్జున్. ఇందుకోసం ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. త్వరలోనే కూతురు ఐశ్వర్యను గ్రాండ్‌గా తెలుగు ప్రేక్షకులకు అర్జున్ పరిచయం చేయబోతున్నాడు. ఈ క్రమంలో చీరకట్టుతో ఐశ్వర్య చేసిన ఫొటోషూట్ వైరల్ అవుతుంది.

