వ్యాక్సిన్ పంపిణీపై తెలంగాణ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్టు శనివారం ప్రకటించింది. 18 నుంచి 45 ఏళ్ల లోపు ఉన్నవారికి ఉచిత వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ఏపీ సర్కార్ శుక్రవారం ప్రకటించింది.
ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒకడుగు ముందుకు వేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు కోట్ల మందికి వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇప్పటివరకు 30 లక్షల మందికి వ్యాక్సిన్ అందించిన సర్కార్.. ఇక రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభాకు వ్యాక్సిన్ పంపిణీ చేయనుంది. దీని వల్ల ప్రభుత్వం మీద 2500 కోట్ల రూపాయల భారం పడనుంది.
దీనిపై సంబంధిత అధికారులకు, సీఎస్‌కు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు రోజుల్లో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించనున్న ఆయన.. జిల్లాల వారీగా ఇంచార్జీల నియామకంతో వ్యాక్సిన్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే, హర్యానా ప్రభుత్వం కూడా ఉచిత వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు తాజాగా ప్రకటించింది. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.