కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. నగరాలు, జిల్లా కేంద్రాలే కాకుండా రాష్ట్రంలోని మారుమూల పల్లెలకు కూడా కరోనా ప్రబలుతున్నది. బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా అమనహళ్లి గ్రామంలో కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. అమనహళ్లిలో 300 మంది జనాభా ఉండగా, ఇటీవల ఆ గ్రామంలో అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఈ పరీక్షల్లో మొత్తం 144 మందికి పాజిటివ్ వచ్చింది. దాంతో గ్రామంలో దాదాపు సగం మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లయ్యింది. ఓ గ్రామంలో సగం మందికి పాజిటివ్‌గా తేలడంతో బెళగావి జిల్లా యంత్రాంగం ఖంగుతిన్నది. బాధితులందరినీ అందుబాటులో ఉన్న ఆస్పత్రులకు తరలించారు. గ్రామాన్ని పూర్తిగా సీల్‌డౌన్ చేశారు.