తెలంగాణ రాష్ట్రంలో పలు శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన జోనల్ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ ‘371డి’లోని (1) (2) క్లాజ్‌ల కింద దాఖలుపడిన అధికారాలను అనుసరించి రాష్ట్రపతి.. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) ఆర్డర్-2018కి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర హోంశాఖ సోమవారం రాత్రి జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. పోలీసు నియమాకాలకు మినహాయించి.. మిగిలిన అన్ని విభాగాలకు ఈ జోన్ల విధానం వర్తిస్తుంది.
దేశంలో ఎక్కడా లేని రీతిలో స్థానికులకే 95 శాతం ఉద్యోగావకాశాలు కల్పిస్తూ.. తెలంగాణలో నూతన జోనల్ వ్యవస్థను కేసీఆర్ సర్కార్ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకూ అమల్లో ఉన్న విధానం ప్రకారం 70 శాతం పోస్టులను స్థానికులకు కేటాయించగా, 30 శాతం పోస్టులు ఓపెన్ కెటగిరీ పరిధిలోకి ఉంచేవారు.
దీని వల్ల స్థానిక అభ్యర్థులు నష్టపోతున్నారనే భావనతో 95 శాతం పోస్టులను స్థానికులకు కల్పించేలా కేసీఆర్ సర్కారు నూతన జోన్ల విధానానికి రూపకల్పన చేసింది. త్వరలో వెలువడబోయే నోటిఫికేషన్లు నూతన జోనల్ విధానం ప్రకారం భర్తీ చేయనున్నారు.