అచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం తరపున అన్నిరకాల సహాయ సహకారాలు అందించటం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్ఛంపేట మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రూ. 5 కోట్ల అంచనా వ్యయంతో అంబేద్కర్ భవనానికి, రూ. 4.5 కోట్ల వ్యయంతో సమీకృత మార్కెట్ సముదాయాన్ని, రూ. 75 లక్షల వ్యయంతో మార్కెట్ యార్డ్ ఉత్తర భాగం రోడ్డు విస్తరణ కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
అనంతరం ఎన్టీఆర్ ఆర్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడ్డాక తెలంగాణలో జరిగిన అభివృద్ధిని ఓసారి బేరీజు వేసుకోవాలన్నారు. సాగు, తాగు నీరు, 24 గంటల ఉచిత విద్యుత్తు, పెన్షన్లు, షాదీముబారక్ తదితర సంక్షేమ పథకాలను చూడాలన్నారు. ఎంపీ రాములు కోరిక మేరకు నాగర్ కర్నూల్ జిల్లాకు నైపుణ్య శిక్షణా కేంద్రం, ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రం, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు హామీ ఇస్తున్నట్లు వెల్లడించారు.
అదేవిధంగా చెన్నకేశవ, ఉమామహేశ్వర ఎత్తిపోతల ద్వారా జిల్లాలో 1.50 లక్ష ఎకరాలకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అచ్ఛంపేట మున్సిపాలిటీలో విలీనమైన 8 గ్రామ పంచాయతీలను తొలగించడమైనదని త్వరలోనే వాటికి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కోరిక మేరకు మున్సిపాలిటీ అభివృద్డికై రూ. 25 కోట్లు అచ్ఛంపేట మున్సిపాలిటికి కేటాయించడం జరుగుతుందని హామీ ఇచ్చారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఏర్పాటు చేసిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి సకల మౌళిక సదుపాయాలు కల్పించి అవసరమైన మేరకు సిబ్బందిని కేటాయించి త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. త్వరలోనే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఎస్ఎల్‌బీసీ కింద ముంపుకు గురైన 11 వందల ఎకరాలకు రావలసిన నష్ట పరిహారం త్వరలోనే ఇప్పిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.