దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది. గత కొద్ది రోజులుగా లక్షకుపైగా పాజిటివ్ కేసులు రికార్డవుతుండగా.. తాజాగా రెండు లక్షలకుపైగా నమోదయ్యాయి. గురువారం 24 గంటల్లో 2,00,739 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొవిడ్-19 బారిన పడి మరణించేవారి సంఖ్యా రోజురోజుకూ పెరుగుతోంది.
మహమ్మారి బారినపడి మరో 1,038 మంది మృతువాతపడ్డారు. కరోనా మహమ్మారి మొదలైన నుంచి ఇంత పెద్ద మొత్తంలో మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. గతేడాది అక్టోబర్ 18న 1,033 మరణాలు సంభవించాయి. రోజులు గడుస్తున్నా కొద్దీ.. కేసులు ఏమాత్రం తగ్గకపోగా.. రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతుండడంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
24 గంటల్లో కొత్తగా 93,528 మంది డిశ్చార్జి అయ్యారు.తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,40,74,564కు చేరగా.. మృతుల సంఖ్య 1,73,123కు పెరిగింది. ఇప్పటి వరకు 1,24,29,564 మంది కోలుకోగా.. ప్రస్తుతం దేశంలో 14,71,877 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది.