ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటించిన తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో లాయర్ నందగోపాల్ అనే కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ నటించారు. ఈ పాత్రకు ఎటువంటి స్పందన వస్తుందో తెలియంది కాదు. తాజాగా వకీల్ సాబ్ చిత్రంలోని తన పాత్ర గురించి, అలాగే తన కెరీర్ విశేషాలను ప్రకాష్ రాజ్ మీడియాతో పంచుకున్నారు.
ఆయన మాట్లాడుతూ..
ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు గత చిత్రాలను కూడా గుర్తుకు తెచ్చుకుంటారు. నేను పవన్ కల్యాణ్‌గారు కలిసి నటించిన ‘బద్రి’ సినిమాలో నందా పాత్ర అలా వారికి బాగా గుర్తుండిపోయింది. వకీల్ సాబ్‌లో నా పాత్రకు నందగోపాల్ అని పెట్టగానే ప్రేక్షకులు బద్రి టైమ్‌కు వెళ్లిపోయి కనెక్ట్ అయ్యారు.
కావాలనే దర్శకుడు నా క్యారెక్టర్‌కు నందా అని పెట్టారు. కథ చెప్పడం కాదు ప్రేక్షకులకు వినోదాన్ని కూడా అందించాలి. నందాజీ, నంద గోపాల్ అని పవన్ గారు నన్ను పిలిచినప్పుడు ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు. దర్శకుడు అందుకే ఆ పేరు పెట్టారు. చాలా మంచి క్యారెక్టర్ చేశాను. సంతోషంగా ఉంది.