నానక్‌రామ్‌గూడ బీఎస్ఆర్ టెక్ పార్కులో మెడ్ ట్రానిక్ ఇంజినీరింగ్ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ బుధవారం ఉదయం ప్రారంభించారు. అమెరికాకు చెందిన వైద్య పరికరాల తయారీ సంస్థ మెడ్ ట్రానిక్.. రూ. 1200 కోట్లతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రపంచస్థాయి వైద్య పరికరాల ఇంజినీరింగ్, ఆవిష్కరణలు చేయనుంది. దీనిద్వారా హెల్త్‌కేర్ రంగంలో ఇంజినీరింగ్ చేసినవారికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
అమెరికాలోని మిన్నెసోటా కేంద్రంగా మెడ్‌ట్రానిక్ పనిచేస్తున్నది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. ఇప్పటికే హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నిర్వహిస్తున్నది. నగరంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రం ద్వారా ప్రారంభంలో వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. విడుతల వారీగా మరో నాలుగు వేల మందికి ఉపాధి కల్పించనుంది. మెడ్‌ట్రానిక్ సంస్థ అమెరికా తర్వాత హైదరాబాద్‌లోనే తన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుండటం విశేషం.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్, ఆపిల్ వంటి అగ్రసంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. అమెరికా తర్వాత రెండో కేంద్రాన్ని మెడ్ ట్రానిక్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. మెడ్ ట్రానిక్ ఇంజినీరింగ్ కేంద్రం ఏర్పాటుతో హెల్త్‌కేర్ రంగంలో ఇంజినీరింగ్ చేసినవారికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నది అని కేటీఆర్ పేర్కొన్నారు.