గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని.. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు పకడ్బంధీగా చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. గురువారం జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిల, అడిషనల్ కలెక్టర్‌తో పాటు ఆయాశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. కొనుగోళ్లకు ముందే రైతులను చైతన్య పరచాలన్నారు.
జిల్లాలో సీజన్‌లో 3.67 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాలో యాసంగిలో ధాన్యం కొనేందుకు 191 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.
గ్రామానికో అధికారిగా నియమించి కొనుగోళ్లలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం, మాస్క్‌ల వాడేలా ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్, అధికారులు అందుబాటులో ఉంటూ కొనుగోళ్లను పర్యవేక్షించాలన్నారు. వచ్చే వానకాలం పంటలు, సాగుపై ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.