నాగార్జున సాగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ అఖండ విజయం సాధించడం ఖాయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. భగత్ కు అన్ని వర్గాల మద్ధతు ఉందని ఆయన స్పష్టం చేశారు. ఉన్నత విద్యావంతుడైన భగత్ ను గెలిపించడం వల్ల నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం తలసాని మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాల ఆదాయం పెంచేందుకు సిఎం కెసిఆర్ చర్యలు తీసుకుంటున్నారని ఆయన వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం కెసిఆర్ రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నారని ఆయన తెలిపారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడ పిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం సాయం చేస్తుందని ఆయన చెప్పారు. భగత్ తన తండ్రి నోముల నర్సింహయ్యకు చేదోడువాదోడుగా ఉండేవారని, ఈ క్రమంలోనే భగత్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని తలసాని సాగర్ నియోజకవర్గ ప్రజలను కోరారు.
పల్లె ప్రగతి ద్వారా గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఈ నియోజకవర్గం నుంచి ఏడు సార్లు గెలిచినప్పటికీ, ఈ నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదని తలసాని ఆరోపించారు. కాంగ్రెస్, బిజెపిలకు ఓటేస్తే ఎటువంటి లాభం ఉండదని, ఈ క్రమంలోనే భగత్ కు మద్ధతు తెలిపి, భారీ మెజార్టీతో గెలిపించాలని తలసాని నియోజకవర్గ ప్రజలను కోరారు.