గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే 2500 స్వచ్ఛ ఆటోలు నడుస్తున్నాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. గురువారం ఉదయం కెటిఆర్ స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా 325 స్వచ్ఛ ఆటోలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెత్తను తరలించేందుకు ఇంతవరకు ఉన్న పాత వాహనాలకు స్వస్తి పలికి స్వచ్ఛ ఆటోలను నడిపిస్తున్నామని ఆయన చెప్పారు.
ఒక్కో స్వచ్ఛ ఆటో 1.5 మెట్రిక్ టన్నుల గార్బేజ్ ను తరలిస్తుందని ఆయన పేర్కొన్నారు. డ్రైవర్ కం ఓనర్ పద్ధతిలో అందించే ఈ ఆటోలను పదిశాతం లబ్ధిదారుడు, 90 శాతం జిహెచ్ఎంసి భరించిందని ఆయన వెల్లడించారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో స్వచ్ఛ ఆటోలు సేవనందిస్తాయని ఆయన తెలిపారు. ప్రతిరోజు ఒక్కో స్వచ్ఛ ఆటో 600 ఇళ్ల నుంచి చెత్తను సేకరిస్తుంది.
ఈ ఆటోల్లో తడి, పొడి చెత్తకు వేర్వేరు పార్టీషన్ ఉండడంతో పాటు ప్రమాదకర వ్యర్థాలకు ప్రత్యేకంగా బాక్స్ ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో శానిటేషన్ పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆయన మేయర్, కమిషనర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటి మేయర్ మోతె శ్రీలత, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.