ప్రభుత్వ ఉద్యోగులైన భార్యాభర్తలకు సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలైన ఉద్యోగ, ఉపాధ్యాయులు ఒకే జిల్లాలో పనిచేయడానికి వీలుగా అంతర్ జిల్లా బదిలీల ప్రక్రియను ప్రభుత్వం వెంటనే ప్రారంభిస్తుంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
శాసనసభ వేదికగా పీఆర్సీ ప్రకటించిన సందర్భంగా కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉపాధ్యాయులు వారి రాష్ట్రానికి తిరిగి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తాం అని సీఎం పేర్కొన్నారు. కేజీబీవీల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది అని చెప్పారు. విధి నిర్వహణలో మరణించిన సీ.పీ.ఎస్.(కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.