ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఉచిత మంచినీటి సరఫరా కోసం ఈ బడ్జెట్‌లో రూ. 250 కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రతీ కుటుంబానికి 20 వేల లీటర్ల సురక్షిత మంచినీటికి ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. దీని వల్ల పేద, మధ్య తరగతి ప్రజలపై వాటర్ బిల్లుల భారం తగ్గిందన్నారు.
నగర ప్రజల భవిష్యత్ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నాగార్జున సాగర్ సమీపంలోని సుంకిశాల నుంచి హైదరాబాద్‌కు నీటిని తరలించడానికి ప్రభుత్వం కొత్త ప్రాజెక్టును నిర్మించనుంది. దీని కోసం రూ. 1450 కోట్లు నిధులు ఖర్చు అవుతాయని అంచనా వేస్తోందని తెలిపారు.
సుంకిశాల వద్ద నిర్మించే ఈ తాగునీటి ప్రాజెక్టు కోసం రూ. 725 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. ఓఆర్ఆర్ పరిధి లోపల కొత్తగా ఏర్పడిన కాలనీలకు తాగునీటి సరఫరా కోసం రూ. 250 కోట్ల నిధులను ప్రతిపాదిస్తున్నామని తెలిపారు.