తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డులు గణనీయంగా పెంచామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. రేషన్ కార్డులు పెంచలేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడటం సరికాదన్నారు. కొత్తగా ఆయన సభకు వచ్చారు. రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పారు.
అది సరికాదు. 2014 కంటే ముందు 29 లక్షల రేషన్ కార్డులుండేవి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 39 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. ఆనాడు రూ. 200 పెన్షన్ ఇస్తే ఈనాడు రూ. 2016 పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. 29 లక్షల 21 వేల 828 పెన్షన్లు ఆ రోజు ఉంటే.. నేడు 39,36,520ల మందికి పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డులు అందరికీ ఇస్తున్నాం. అప్పుడు కార్డు మీద 20 కేజీల పరిమితి పెట్టిండ్రు. ఇప్పుడు ఆ పరిమితి ఎత్తేసి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున రేషన్ ఇస్తున్నామని చెప్పారు
గంధమల్ల, మల్లన్న సాగర్ నిర్వాసితులకు మంచి పరిహారం ఇస్తున్నామని తెలిపారు. హైదరాబాద్, వరంగల్‌లో ఇచ్చే రేటును పల్లెల్లో ఇవ్వరు. చట్టాలను అనుసరించి, నిబంధనలు పాటిస్తూ.. భూములకు నష్ట పరిహారం ఇస్తున్నాం. ఎవరికీ నష్టం జరగనివ్వం. గజ్వేల్ పట్టణానికి సమీపంలో ఏడున్నర వేల ఇండ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. ఎస్సార్ఎస్పీ తర్వాత నీటి సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు మల్లన్న సాగర్ ప్రాజెక్టు..
ఇది 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నాం. ఇది చాలా ప్రాంతాలకు వనరుగా ఉంటుంది. మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై 371 కేసులు వేశారు. వీటన్నింటి మీద ఫైట్ చేస్తూ.. ప్రాజెక్టును కంప్లీట్ చేస్తున్నాం. దేశంలో ఎవరికీ ఇవ్వని విధంగా పరిహారం ఇస్తూ, డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.