కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు సీఎం కేసీఆర్ శాసనసభలో చురకలంటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఎమ్మెల్యే భట్టి మాట్లాడుతూ.. గవర్నర్ తమిళిసై వ్యవసాయ రంగం గురించి గొప్పగా చెప్పారు.
అయితే కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఢిల్లీ సరిహద్దుల్లో వేల సంఖ్యలో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఆందోళన చెందుతున్నారు అని భట్టి వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. భట్టి విక్రమార్క ఉప సభాపతిగా కూడా పని చేశారు. సభా నిబంధనలు మన కంటే వారికే ఎక్కువ తెలుసు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై మనం చెప్పాల్సింది చెప్పాం.
సభ నుంచి , బయటి నుంచి కూడా చెప్పాం. సభలో రాష్ర్టానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటే మంచిది. మీ పార్టీ సభ్యులు.. పార్లమెంట్‌లో ఉన్నారు కాబట్టి.. కేంద్ర పరిధిలో వచ్చే విషయాలు అక్కడ మాట్లాడితే మంచిదని భట్టి విక్రమార్కకు సీఎం కేసీఆర్ చురకలంటించారు.