ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ దూసుకుపోతున్నది. జాతీయ సగటును మించి వృద్ధిని నమోదు చేస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21)లో రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు ఏడు శాతం పెరిగి రూ.1.4 లక్షల కోట్లకు చేరవచ్చని నాస్కాం అంచనా వేసింది.
మరోవైపు జాతీయ వృద్ధిరేటు సగటు 1.9 శాతం ఉండవచ్చని తెలిపింది. దీనిపై రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ఐటీరంగంలో తెలంగాణ అద్భుతమైన వృద్ధిని సాధిస్తుందన్నారు. 2013-14లో రూ.57 వేల 258 కోట్లుగా ఉన్న ఎగుమతులు 2020-21 నాటికి రూ.1 లక్షా 40 వేలకు చేరుకున్నట్లు తెలిపారు. ఇది జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ అన్నారు.
ఎన్డీయే ప్రభుత్వం ఐటీఐఆర్‌ను రద్దు చేయకపోయుంటే ఇంకా అధిక వృద్ధి, ఎక్కువ ఉపాధి అవకాశాలు లభించేవన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ఐటీశాఖ మంత్రికి ప్రభుత్వ పరంగా, వ్యక్తిగతంగా అనేకమార్లు అభ్యర్థనలు చేసినప్పటికీ తెలియని కారణాలతో కేంద్రం ఐటీఐఆర్‌ను రద్దు చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్, ఐటీ క్లస్టర్ వివరాలను సమర్పించినప్పటికీ దురదృష్టవశాత్తు కేంద్రం ఐటీఐఆర్‌ను ముందుకు తీసుకుపోలేదన్నారు.