దళిత గిరిజనుల హక్కులు కాపాడటంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్నది. దళిత, గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. మూడేండ్ల క్రితం (2018) సీఎం కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు అంకురార్పణ చేశారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ చైర్మన్‌గా, బోయిళ్ల విద్యాసాగర్, ముదావత్ రాంబాల్‌నాయక్, కుస్రం నీలాదేవి, సుంకపాక దేవయ్య, చిల్కమర్రి నర్సింహ సభ్యులుగా కమిషన్ ఏర్పాటైంది. అనేక సమస్యలను మూడేండ్లలోనే కమిషన్ పరిష్కరించింది.
ఫిర్యాదుల పరిష్కారంలో నూతన పంథా
ఆన్‌లైన్ ద్వారా అందే సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించింది. పలు సమస్యలపై సూమోటాగా కేసులు నమోదుచేసి బాధితులకు అండగా నిలిచింది. ఇప్పటివరకు 7,932 కేసులను పరిష్కరించింది. ప్రతినెలా 30న పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించింది. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట మండలం అలియాబాద్‌లో పదివేలమందితో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించి రికార్డు నెలక్పొలింది. గడచిన మూడేండ్లలో 9,787 గ్రామాల్లో పౌరహక్కుల దినోత్సవాలు జరిపింది. 33 జిల్లాల్లో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించింది.
13,905 మందికి రూ.79 కోట్ల పరిహారం
కమిషన్ ప్రత్యేక చొరవ తీసుకొని రికార్డుస్థాయిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నష్టపరిహారాన్ని బాధితులకు అందించింది. మూడేండ్లలో 13,905 మంది అట్రాసిటీ బాధితులకు కమిషన్ చొరవతో రూ.78,30,75,105 నష్టపరిహారం అందింది. కమిషన్ చొరవతో హైదరాబాద్‌లో 29 ఏండ్లుగా ఓ ఇంట్లో వెట్టచాకిరీ చేసిన యువతకి స్వేచ్ఛ లభించింది. ఆ యువతికి కమిషన్ పర్యవేక్షణలో పెండ్లి జరగడం విశేషం. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకర్గంలో నక్కలజాతుల ఆవాసాలు కమిషన్ సందర్శించి ఏ గుర్తింపులేని వారికి ఆధార్, రేషన్, ఓటరు కార్డులు వచ్చేలా చర్యలు తీసుకొన్నది.
జన అదాలత్-దేశంలోనే తొలి అడుగు
దేశంలోనే తొలిసారిగా కమిషన్ జన అదాలత్‌ను నిర్వహించింది. వివిధ బాధిత కుటుంబాలకు చెందిన 1,000 మంది ఎస్సీ, ఎస్టీల పిల్లలకు కమిషన్ చొరవ తీసుకొని రెసిడెన్షియల్ స్కూళ్లల్లో ప్రవేశాలు కల్పించింది. సిండికేట్ బ్యాంకులో ఓ బాధితుడికి న్యాయంచేసే క్రమంలో బ్యాక్‌లాగ్ ఖాళీలు భర్తీకి చర్యలు తీసుకొన్నది. దాంతో బ్యాంకులో 50 మందికి క్లాస్-4 ఉద్యోగాలు వచ్చాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన దారి.
ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కు లు, ఆత్మగౌరవాన్ని కాపాడటంలో కమిషన్‌కు ప్రభుత్వంలోని అన్ని శాఖలు సహకరించాయి. ప్రత్యేకించి ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన దారిలో దళిత, గిరిజనులు ఆత్మగౌరవంతో ముందడుగు వేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కమిషన్‌కు సరైన కార్యాలయం కూడా లేదు. కానీ నేడు కమిషన్ కార్యాలయం దళిత, గిరిజనుల ఆత్మగౌరవ వేదికగా నిలిచింది. నేనే కాదు కమిషన్ సభ్యులంతా చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేశాం. అందరి సహకారం వల్లనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతున్నది. దేశంలోనే మన కమిషన్ అన్ని అంశాల్లో నంబర్‌గా నిలిచింది.
-డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, చైర్మన్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్