టీమ్‌ఇండియా తరఫున ఓ పేసర్ వంద టెస్టులు ఆడటం అంటే మామూలు విషయం కాదు. అప్పట్లో దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ (131) ఈ ఘనత సాధించగా.. ఆ తర్వాత ఎందరో పేసర్లు జట్టులోకి వచ్చినా.. వారెవరూ ఈ మార్క్ చేరుకోలేకపోయారు.
జహీర్ ఖాన్ (92) ఆశలు రేపినా సెంచరీ మాత్రం కొట్టలేక పోయాడు. ఆ అవకాశం ఇషాంత్ శర్మకు దక్కింది. 2007లో అరంగేట్రం చేసిన ఈ ఆరడుగుల బుల్లెట్ తన సుదీర్ఘ కెరీర్‌లో వందో టెస్టుకు రెడీ అయ్యాడు.
బుధవారం నుంచి అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగనున్న మూడో టెస్టులో లంబూ ఈ మైలురాయి అందుకోనున్నాడు. వంద అనేది తనకు అంకె మాత్రమే అంటున్న ఇషాంత్.. తనలో సత్తా ఉన్నంత కాలం జట్టు విజయాల కోసం పాటుపడతానన్నాడు.