హమ్మయ్య.. కరోనా తగ్గుముఖం పడుతోందని ఊపిరిపీల్చుకొనేలోపే మహమ్మారి మళ్లీ తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది. ప్రజల అలసత్వాన్ని ఆసరాగా, అజాగ్రత్తను ఆయుధంగా చేసుకొని విజృంభిస్తున్నది. ఫలితంగా దేశంలో కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా మళ్లీ పెరుగుతున్నది. శుక్రవారం ఒక్కరోజే (శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు) దేశంలో 13,993 మంది కరోనా బారిన పడ్డారు. గడిచిన 22 రోజులతో పోల్చితే ఒక్కరోజులో వైరస్ బారిన పడ్డవారి సంఖ్యాపరంగా ఇదే అత్యధికం. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,09,77,387కు పెరిగింది. ప్రస్తుతం 1,43,127 మంది కొవిడ్ చికిత్స పొందుతున్నారు. వీరిలో దాదాపు 76 శాతం మంది మహారాష్ట్ర, కేరళ రాష్ర్టాలకు చెందినవారే ఉన్నారు.
ఆరు రాష్ర్టాల్లో వేగంగా వ్యాప్తి
మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. శుక్రవారం నమోదైన కేసుల్లో దాదాపు సగం (6,112) కేసులు మహారాష్ట్రకు చెందినవే. కేరళలో రోజుకు 4వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ ఆరు రాష్ర్టాల నుంచే రోజూ 87% కేసులు వస్తున్నాయి. మరణాల సంఖ్యపరంగా కూడా మహారాష్ట్ర అధ్వాన్న స్థితిలో ఉన్నది. శుక్రవారం 101 మరణాలు నమోదు కాగా.. మహారాష్ట్రలో 44 మంది చనిపోయారు. దీంతో వైరస్ కట్టడి కోసం ఈ ఆరు రాష్ర్టాల ప్రభుత్వాలు తిరిగి కఠిన చర్యలు చేపడుతున్నాయి.