తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా చేపట్టిన కోటివృక్షార్చన కార్యక్రమంలో అందరం భాగస్వాములవుదాం అని పిలుపునిచ్చారు రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్.కోటి వృక్షార్చన కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మీడియాతో వెల్లడించిన సంతోష్.హరిత వందనాలు వాస్తవాలను ప్రజల కళ్లముందుంచుతూ.. మంచిని వివరిస్తూ.. చెడును ఎత్తిచూపుతూ సమాజాన్ని చైతన్య పరచడంలో మీడియా పాత్ర వెలకట్టలేనిది. సమాజం పట్ల, పౌరుల హక్కుల పరిరక్షణ పట్ల మీ నిబద్దత ఎల్లప్పుడూ ప్రశంసనీయం.
దేశం పచ్చగా ఉండాలనే లక్ష్యంతో తెలంగాణకు హరితహారం స్పూర్తితో కొన్నేళ్ల కింద చేపట్టిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’కు మనదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా అద్భుత స్పందన వస్తున్నది. ఈ హరిత సంకల్పానికి మీడియా మిత్రుల సహకారం లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదు.ఇదే స్పూర్తితో గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ఇప్పుడు ‘కోటి వక్షార్చన’ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. మన గౌరవ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారి 66వ జన్మదినం సందర్భంగా ఈ నెల 17వ తేదీన ఉదయం 10 గంటలకు కోటి మొక్కలను నాటాలని సంకల్పించాం. తెలంగాణతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో, ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో వక్షార్చన జరుగుతుంది. భూమాతను పరిరక్షించడానికి..
కాలుష్యం, వాతావరణ మార్పులు, ప్రకతి విపత్తుల నుంచి సమస్త మానవాళిని కాపాడటానికి మనవంతుగా చేయాల్సిన బాధ్యతను ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తుందని నమ్ముతున్నాం.ఈ ‘మహా హరిత క్రతవు’లో మీడియా సంస్థలు, జర్నలిస్టులు పాల్గొనాలని నేను సవినయంగా కోరుతున్నా. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మన భూమి, మన వాతావరణం.. వీటిని కాపాడుకుంటూనే, మరింత మెరుగుపరిచి భవిష్యత్తు తరాలకు అందించే హరిత ఉద్యమంలో మీరూ పాలుపంచుకోండి. గ్రీన్ ఇండియా చాలెంజ్ అంటే పచ్చదనాన్ని పెంపొదించడమేకాదు. ప్రాకృతిక జీవన విధానాన్ని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం.. వ్యర్థాలను తగ్గించడం.. నీటి వనరులను పరిరక్షించడం కూడా. మానవుల జీవన ప్రమాణాలు పెంచాలన్న సంకల్పంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇదే ఉత్సాహంతో కొనసాగుతుందని ఆశిస్తున్నాం.రండి.. చేయి చేయి కలుపుదాం. మన భవిష్యత్తు తరాలకు మనం అందించబోయే గొప్ప బహుమతిలో మనందరం భాగస్వాములం అవుదాం అన్నారు.