తెలంగాణలో త్వరలో జరగనున్న నాగార్జునసాగర్ ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా ప్రముఖ న్యాయవాది మువ్వా అరుణ్‌కుమార్ పోటీచేస్తారని టీడీపీ-టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ శనివారం తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు పేర్కొన్నారు.
అనుముల మండలం చింతగూడెం గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్ వృత్తిరీత్యా న్యాయవాది. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఆయన ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పుడే టీడీపీలో చేరి క్రియాశీలంగా పనిచేస్తున్నారు. 2006-15 వరకు పార్టీ లీగల్‌సెల్ కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా సేవలందించారు.
2020 నుంచి నాగార్జునసాగర్ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తనపై నమ్మకం ఉంచి అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు, రమణకు అరుణ్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.