టాలీవుడ్లో హీరోయిన్ల తమ్ముళ్లు హీరోలవుతోన్న ట్రెండ్ నడుస్తుందా? అంటే అవునని చెప్పక తప్పదు. కారణం ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు హీరోగా చేస్తున్నాడు. ఇప్పుడు.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ ఊపు ఊపిన రక్షిత తమ్ముడు రానా హీరోగా పరిచయం కాబోతున్నాడు. మరో విశేషం ఏమిటంటే.. రానా హీరోగా పరిచయం అవుతున్న చిత్రాన్ని స్వయంగా రక్షితనే నిర్మిస్తుండటం.
తన తమ్ముడు రానాను హీరోగా పరిచయం చేస్తూ నాలుగు భాషల్లో ‘‘ఏక్ లవ్ యా’’ అనే సినిమా తీస్తోంది రక్షిత. ఈ చిత్రానికి మరో విశేషం కూడా ఉంది. అదేంటంటే రక్షిత భర్త, కన్నడ స్టార్ డైరెక్టర్ జోగి ప్రేమ్ ఈ చిత్రానికి దర్శకుడు. కన్నడలో శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్, దర్శన్, సుదీప్ లాంటి పెద్ద హీరోలతో చాలా సినిమాలు చేశాడు ప్రేమ్.
తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ మూవీతో రక్షిత, ప్రేమ్‌లు రానాను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఇక రానా విషయానికి వస్తే ఫస్ట్ లుక్‌లోనే సిక్స్ ప్యాక్‌తో దర్శనమిచ్చాడు.
రానా సరసన రీష్మ, రచితారామ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఆదివారం ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయబోతోన్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుగుతున్నట్లుగా చిత్రయూనిట్ తెలిపింది.