తెలంగాణ రాష్ట్రంలో దళితులు సంపూర్ణ సాధికారత సాధించాల్సిన అవసరం ఉందని సీఎం కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో దళితులు వెనుకబడి ఉన్నారని, వారిని బాగుచేసుకొనే బాధ్యత మనదేనని చెప్పారు. దళితుల అభివృద్ధి కోసం సబ్‌ప్లాన్ తెచ్చి కొంత ప్రయత్నాలు చేశామని, ఇంకా చేయాల్సి ఉన్నదని అన్నారు. దళితుల కోసం ఈ సంవత్సరం బడ్జెట్‌లో ‘సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ స్కీం’ పేరుతో వెయ్యి కోట్లు కేటాయించనున్నామని ప్రకటించారు.
నల్లగొండ జిల్లా హాలియాలో బుధవారం జరిగిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. దళితుల అభ్యున్నతిపై సీఎం చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. ‘సమాజంలో కొంత వెలితి ఉన్నది. దానిని మనందరం ఒప్పుకోవాలె. కొంత వివక్ష జరిగింది కాబట్టి దళిత జాతి వెనుకబడి ఉన్నది. దళితులు వెనుకకు ఉన్నన్ని రోజులు సమాజం సిగ్గుపడే పరిస్థితి ఉంటది.
కాలి వేలు నుంచి నెత్తి దాకా బాగుంటేనే శరీరం బాగుంటది. అట్లే అన్ని వర్గాల ప్రజలు బాగుంటేనే సమాజం బాగుంటది. కాబట్టి దళితులను బాగు చేసుకునే బాధ్యత కూడా మనమీదనే ఉన్నది. సబ్‌ప్లాన్ తెచ్చి కొంత ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంకా పైకి రావాల్సి ఉన్నది. వాళ్లకోసం ఈ సంవత్సరం బడ్జెట్‌లో ‘సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్’ పేరుతో రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తాం.
రాబోయే రోజుల్లో ఈ నిధులను ఇంకా పెంచుతాం. దానిని నేనే స్వయంగా మానిటర్ చేస్తా. బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తాం. కులం లేకుండా.. మతం లేకుండా.. వివక్ష లేకుండా.. తెలంగాణ కుటంబాలన్నీ మావేనని.. యావ త్ తెలంగాణను బంగారు తును క లాగా తయారు చేయాలని కష్టపడుతున్నాం. ఇతెలంగాణ మేధావిలోకం, యువలోకం, మహిళా లోకం ఇవన్నీ గుర్తించాలె అని సీఎం కేసీఆర్ హాలియా సభ సాక్షిగా అన్నారు