ఏడాదిన్నరలో నల్లగొండ సాగునీటి కష్టాలను శాశ్వతంగా పరిష్కరిస్తానని, జిల్లాను సస్యశ్యామలంగా మారుస్తానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. చెప్పినవిధంగా నీళ్లియ్యకపోతే ఓట్లు అడగబోమని పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండలో 13 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపనచేశామని చెప్పారు. బుధవారం నల్లగొండ జిల్లా హాలియా బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
ప్రతి ఎకరాకూ సాగునీరిస్తా
నల్లగొండ చాలా చాలా నష్టపోయినా జిల్లా. అనాదిగా కష్టనష్టాలు పడ్డ జిల్లా. ఎన్నడూ ఏ నాయకుడూ, ఏ ముఖ్యమంత్రీ పట్టించుకోలె. హుజూర్‌నగర్ ఉపఎన్నిక జరిగినప్పట్నుంచి నిరంతరం సమస్యలు నా దృష్టికి వస్తున్నాయి.
ఒక్కొక్కటిగా కాకుండా అన్నీ కలిపి ఒకేసారి కలిపి పరిష్కరిద్దామని చెప్పిన. గతంలో ఇదే హాలియా సభలో స్పష్టంగా చెప్పిన. నల్లగొండ జిల్లాకు అన్యాయం జరుగకుండా చూస్తానని, కుర్చీ వేసుకొని కూసొనైనా సరే ఎడమ కాలువ కింద గల ఆయకట్టు పరిధిలోని ప్రతి ఎకరానికి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పిన. దేవరకొండ ప్రాంతంలో ఉన్న పేద గిరిజన సోదరులందరికీ లాభం చేస్తానని చెప్పిన. ఈరోజు సుమారు రూ.2,500 కోట్లతో 13 లిఫ్టు స్కీంలకు శంకుస్థాపన చేసిన. వీటన్నింటినీ ఏడాదిన్నరలో పూర్తిచేసి నీళ్లందిస్తానని మనవి చేస్తున్నా. మా భాస్కర్‌రావు ఎమ్మెల్యే ఈ మూడే చాలు సారు.. నేను ఇంకా ఏమీ అడగనని అన్నారు. నిన్నరాత్రి ఫోన్‌చేసి నాగులపల్లి మండలంలో నీళ్లపాలెం, టోకుచెర్ల లిఫ్టులు ఉన్నాయన్నారు. వీటిని కూడా రెండు మూడురోజుల్లో మంజూరుచేస్తా.
ఈ బడ్జెలోనే నిధులు కేటాయిస్తాం
పిచ్చిపిచ్చి మాటలు (ప్రతిపక్షాలనుద్దేశించి) బంద్ చేసుకొని ఉంటే మంచిది. మాకు ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. ఎవరో ఢిల్లీవాళ్లు నామినేట్ చేస్తే వచ్చిన ప్రభుత్వం కాదు. డంబాచారాలు చెప్పే ప్రభుత్వం కాదు. మాట ఇచ్చినం అంటే చేసి తీరుతాం. మిషన్ భగీరథ పథకంలో ఇంటింటికీ నల్లా ఇవ్వకపోతే ఓట్లడగం అని చెప్పినం. ప్రూవ్ చేసుకున్నం. అదీ టీఆర్‌ఎస్ అంటే. ఈరోజు నల్లగొండలో చెప్పిన మాటలు ఆచరించి తీరుతాం. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పూర్తి కాబోతున్నది. ఎస్సెల్బీసీ టన్నెల్, ఉదయసముద్రం-బ్రాహ్మణ వెల్లెంల లిఫ్ట్ పనులు కూడా త్వరలోనే పూర్తి కాబోతున్నయి.
ఎట్టి పరిస్థితుల్లో వట్టిపోవద్దు
కృష్ణా నదిలో నీళ్లు తక్కువగా ఉంటాయి. దేవునిదయ వల్ల రెండేండ్లుగా నది పొంగిపొర్లుతున్నది. కానీ కొన్ని సందర్భాల్లో నీళ్లురావు. లిఫ్టులుగానీ, ఎడమ కాలువ ఆయకట్టుగానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వట్టిపోవద్దు. కృష్ణ నీళ్లు రానప్పుడు వాడుకొనే విధంగా సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ నింపుకున్నాం. ఆ రిజర్వాయర్ నుంచి దిగువన ఉన్న దేవులపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు లిఫ్టుపెడితే నల్లగొండలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఇందుకోసం రూ.600 కోట్లతో ఎస్టిమేషన్ రెడీ అయింది. దానిని తొందర్లోనే శాంక్షన్ చేస్తా. అవసరమైన సందర్భంలో వాడుకోవడానికి గోదావరి నీళ్లు కూడా పెద్దదేవులపల్లికి తెచ్చి కృష్ణా గోదావరి అనుసంధానంచేసి నల్లగొండ రైతుల కాళ్లు కడుగుతానని చెప్తున్న.
జూన్ నాటికి గంధమల్ల-బస్వాపురం
పెద్ద పెద్ద డైలాగులు కొట్టే కాంగ్రెస్ నాయకులు ముక్త్యాల బ్రాంచ్ కెనాల్‌కు 50 ఏండ్లుగా ఎందుకు లైనింగ్ చేయలే? 1987లో నేను కరువు మంత్రిగా జిల్లాకు వచ్చిన. నేటిదాకా రాజవరం మేజర్‌కు, ముక్త్యాల బ్రాంచ్‌కు నీళ్లురాలే. ఈ ముఖాలన్నీ ఏడికి పోయినయ్? కానీ, ఈరోజు మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అన్ని ప్రాంతాలకు నీళ్లొస్తున్నయ్. కొన్నిరోజుల్లోనే గంధమల్ల-బస్వాపురం ప్రాజెక్టు పూర్తిచేసి వచ్చే జూన్ నుంచి ఆలేరు, భువనగిరిని సస్యశ్యామలం చేయబోతున్నాం. డిండి లిఫ్ట్ కంప్లీట్ అయితే ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలు మొత్తం సస్యశ్యామలం అవుతయి. ఫ్లోరైడ్ లేకుండా, రైతులందరూ దర్జాగా బతికేలా కార్యక్రమాలు చేస్తున్నాం. వీటిని ప్రజలు దయచేసి గమనించాలి అని సూచించారు.