ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లిన ఓ తెలంగాణ వ్యక్తి అక్కడ గుండెపోటుతో మరణించాడు. మంత్రి కేటీఆర్ చొరవతో ఆ వ్యక్తి మృతదేహం ఇవాళ సొంతూరుకు చేరుకుంది. వీర్నపల్లి మండలం మద్దిమల్ల లొద్దితండాకు చెందిన మాలోతు హరిలాల్ జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లాడు.
ఈ క్రమంలో జనవరి 31వ తేదీన అతనికి గుండెపోటు రావడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని సొంతూరుకు తరలించేందుకు ఇబ్బందులు తలెత్తడంతో.. స్థానిక నాయకులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు.
వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ దుబాయ్‌లోని ఇండియా ఎంబసీ అధికారులతో మాట్లాడి మృతదేహాన్ని తెప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో శనివారం హరిలాల్ మృతదేహం స్వగ్రామానికి చేరింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి లొద్దితండాకు తరలించేందుకు అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా మంత్రి కల్పించారు. హరిలాల్ కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.