వచ్చే ఉగాది నుంచి వరంగల్ మహానగరంలో నల్లాల ద్వారా ఇంటింటికీ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మంచినీటిని సరఫరా చేయనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఆదివారం ఆయన వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 57వ డివిజన్ హనుమాన్‌నగర్‌లో ప్రజా సంక్షేమ ప్రగతి యాత్రలో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. మురుగు నీటి కాలువలు, సుందరయ్యనగర్‌లో బాక్స్ డ్రైన్ నిర్మాణం, హనుమాన్‌నగర్‌లో రోడ్లు, వేంకటేశ్వర దేవాలయం ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణం తదితర పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎవరూ ఊహించని విధంగా సీఎం కేసీఆర్, మంత్రి కేసీఆర్ సహకారంతో గ్రేటర్ వరంగల్‌ను హైదరాబాద్‌కు మించి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. మరికొద్ది రోజుల్లో అన్ని రోడ్లు, డ్రైనేజీలు పూర్తవుతాయని, అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసి నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.
వరద ముంపు లేకుండా శాశ్వత ప్రాతిపదికన చేపట్టామన్నారు. కరోనా సమయంలోనూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వరదల సమయంలో ఆదుకున్నారన్నారు. వరదలు, కరోనా సమయంలో రాని నేతలు ఇప్పుడు వరంగల్‌కు వస్తున్నారని, ఏం చేయనోళ్లు కాస్త ఎక్కువనే మాట్లాడుతారన్నారు. వినయ్ భాస్కర్ ఎమ్మెల్యే అయ్యాకనే పశ్చిమ నియోజకవర్గం మంచి అభివృద్ధి సాధించిందని చెప్పారు.