టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ భవన్‌లో పార్టీ రాష్ట్రకమిటీ సభ్యులతోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్ అధ్యక్షులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.
టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీల నియామకంపై చర్చించనున్నారు. టీఆర్‌ఎస్ వార్షికోత్సవం (ఏప్రిల్ 27) నాటికి పరిస్థితులను బట్టి ప్లీనరీ నిర్వహించేది.? లేనిది ఈ సమావేశంలో అధినేత కేసీఆర్ స్పష్టం చేసే అవకాశాలున్నాయి.
కరోనా నేపథ్యంలో గతేడాది పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించలేదు.పార్టీ ఆవిర్భవించి 20 ఏండ్లు కావొస్తున్న నేపథ్యంలో ద్విదశాబ్ది ఉత్సవాల నిర్వహణకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
ఎమ్మెల్సీ, కార్పొరేషన్లు, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా సీఎం నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మార్చి చివరినాటికి గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు చేసి వార్షికోత్సవం నాటికి రాష్ట్రకమిటీ ఏర్పాటు ప్రక్రియ పూర్తిచేయాలని ఇటీవల పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.