తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల్లో తరగతి గదిల్లోకి 50 శాతం విద్యార్థులను మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం మంత్రి తన కార్యాలయంలో ఉన్నతవిద్యా శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి కళాశాల తరగతులవారీగా ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అమలుచేయాలని ఆదేశించారు.
కొవిడ్ మార్గదర్శకాలను అనుసరించి తరగతులను నిర్వహించాలని, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను తరచూ తనిఖీచేయాలని సూచించారు. ప్రతిరోజు శానిటైజేషన్ ప్రక్రియను చేపట్టేందుకు వీలుగా ఒక్కో వర్సిటీకి రూ.20 లక్షలు తక్షణ సాయంగా అందించాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డిని ఆదేశించారు.
కళాశాలలు పూర్తి సురక్షితం అన్న భావనను కల్పించాలని తెలిపారు. కాలేజీల్లో విద్యార్థులు గుమిగూడకుండా యాజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, ఉన్నత విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.