నల్లగొండ ఫ్లోరైడ్ ముఖచిత్రంగా దేశవ్యాప్తంగా అందరికీ సుపరిచితులైన ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి శుక్రవారం మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. గతంలో అంశాల స్వామి జీవనాధారం కోసం ప్రత్యేకంగా ఒక షాప్ (సెలూన్) ని మంత్రి ఏర్పాటు చేయించిన సంగతి తెలిసిందే.
తాజాగా అంశాల స్వామికి ఒక పక్కా ఇల్లు నిర్మించి అందించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం తరపున అంశాల స్వామికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాల్సిందిగా స్థానిక జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను ఆదేశించారు. స్వామికి ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యతను తీసుకోవాల్సిందిగా పార్టీ సీనియర్ నాయకులు కర్నాటి విద్యాసాగర్ అప్పగించారు.
గతంలో తన జీవనం సాగేందుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా తగిన ఏర్పాట్లు చేసిన మంత్రి కేటీఆర్, ఇప్పుడు తన సొంత ఇంటి కల నెరవేర్చుతుండటంపై స్వామి సంతోషం వ్యక్తం చేస్తూ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరైడ్ సమస్య నుంచి క్రమంగా విముక్తి లభిస్తున్నట్లు తెలిపిన స్వామి.. సీఎం కేసీఆర్‌ను కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపనున్నట్లు పేర్కొన్నారు.