తెలంగాణ మత్స్యశాఖ మరో వినూత్న కార్యక్రమాన్ని రూపొందించింది. తాజా చేపలను, చేపల వంటకాలను నేరుగా వినియోగదారుడి వద్దకు చేర్చడంతోపాటు.. వాటి విక్రయం ద్వారా మహిళలూ ఉపాధి పొందేలా కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఇందుకోసం చేపలతోపాటు, చేపల వంటకాలనూ విక్రయించేలా తయారుచేసిన సంచార విక్రయ వాహనాలను (మొబైల్ ఫిష్ ఔట్‌లెట్స్) అందుబాటులోకి తెచ్చింది.
గ్రూపులుగా ముందుకొచ్చే మహిళలకు వీటిని అందజేయాలని నిర్ణయించింది. దీనిద్వారా నిరుద్యోగ మహిళలకు ఉపాధి అందనుండగా.. వినియోగదారుడికి తన ఇంటివద్దనే నాణ్యమైన చేపలు చేరనున్నాయి. ఈ పథకం కింద ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక దాదాపు పూర్తికాగా.. ఫిబ్రవరి మొదటివారంలో సంచార చేపల విక్రయ వాహనాలను అందజేయనున్నా రు.
ఈ పథకంలో భాగంగా అందించే ఒక్కో వాహనం ఖరీదు రూ.10 లక్షలుగా ఉన్నది. ఇందులో ప్రభుత్వం 60 శాతం సబ్సిడీ ఇవ్వనుండగా.. 40 శాతం లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఒకే ప్రాంతానికి చెందిన ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ మంది మహిళలు ఒక గ్రూపుగా ఏర్పాటై.. సమ్మతిని ప్రభుత్వానికి అందజేయాలి. అధికారులు అర్హతలను బట్టి లబ్ధిదారులను ఎంపికచేస్తారు.