‘ఇది కాళేశ్వరం కాదు, తెలంగాణకు పట్టిన శనేశ్వరం.. వరదలు వస్తే మోటర్లు బంజేసుకునే ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడన్నా ఉంది అంటే, అది మన తెలంగాణలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కటే.. రీ డిజైన్‌లో భాగంగా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో మోటర్లను 800 అడుగుల నుంచి 821 అడుగుల వద్ద వరదకు అందనంత ఎత్తులో పెట్టారు..’ ఇవీ.. ఈ మధ్య వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టిన మెసేజ్‌లు. మిడిమిడి జ్ఞానంతో, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతల ప్రక్రియ పట్ల అవగాహన లేమితో వాట్సాప్‌లో అవాస్తవాలను ఫార్వర్డ్ చేసిన కొందరి కోసమే ఈ వ్యాసం.
కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు మార్గాల ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశాలున్నాయి. మొదటి స్థితి శ్రీరాంసాగర్‌కు వరద వచ్చినప్పుడు వరదకాలువ ద్వారా మిడ్‌మానేరుకు, కాకతీయకాలువ ద్వారా దిగువ మానేరు చేరుతాయి. ఇవి పోగా ఇంకా వరద ఉంటే డ్యాం గేట్ల ద్వారా నదిలోకి వదులుతారు. అవి ఎల్లంపల్లికి వెళ్తాయి. ఎల్లంపల్లి నిండితే సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డకు వెళ్తాయి. ఆ తర్వాత తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీ ద్వారా పోలవరానికి వెళ్తాయి. శ్రీరాంసాగర్‌కు కనీసం మూడేండ్లకోసారైనా వరద వచ్చే అవకాశం ఉన్నదని గత 25 ఏండ్ల చరిత్ర చూస్తే తెలుస్తున్నది. శ్రీరాంసాగర్‌కు వరద వచ్చిన స్థితిలో కాళేశ్వరం లింక్-1 పంపులు (మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి), లింక్-2 పంపులు (ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు) తిప్పే అవసరం రాదు.
రెండో స్థితి శ్రీరాంసాగర్‌కు వరద రాకున్నా ఎల్లంపల్లికి కడెం నది నుంచి, శ్రీరాంసాగర్ ఎల్లంపల్లికి మధ్య ఉన్న పరీవాహక ప్రాంతం నుంచి వరద వచ్చే అవకాశం ఉన్నది. దాదాపు ఏటా మనకు ఈ స్థితి ఎదురవుతుంది. ఈ స్థితిలో కాళేశ్వరం లింక్-1 పంపులు తిప్పే అవసరం రాదు. ఎల్లంపల్లి నుంచే లింక్-2 పంపులు తిప్పి నీటిని మిడ్ మానేరుకు చేరవేయడం, అక్కడినుంచి ఎగువకు అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ దాకా ఎత్తిపోయడం, దిగువ మానేరుకు, అక్కడినుంచి కాకతీయ కాలువ ద్వారా శ్రీరాంసాగర్ మొదటి దశ, రెండో దశ ఆయకట్టుకు నీటి సరఫరా, అవసరమైతే పునరుజ్జీవన పథకం ద్వారా శ్రీరాంసాగర్ జలాశయానికి నీటిని ఎత్తిపోయడం జరుగుతుంది.
ఇక మూడో స్థితి పైరెండు చోట్ల నీటి లభ్యత లేని సందర్భాల్లో మాత్రమే లింక్-1, లింక్-2 పంపులను ఏకకాలంలో తిప్పవలసిన అవసరం ఏర్పడుతుంది. 2019 జూన్, జూలైలలో రాష్ట్రమంతా కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి నీటిని ఎల్లంపల్లికి ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభమైంది. గోదావరి నది విజయవంతంగా 115 కి.మీ ఎదురెక్కి వచ్చింది. మేడిగడ్డ జలాశయం నుంచి మూడు స్టేజీల్లో నీటిని ఎల్లంపల్లి జలాశయానికి ఎత్తిపోయడమైంది. ఆగస్టు చివరలో ఎగువన కడెం, ఎల్లంపల్లి పరీవాహక ప్రాంతం నుంచి వరద రావడం ప్రారంభమైంది. వెంటనే ప్రభుత్వం లింక్-1 పంపులను ఆపేసింది. ఎల్లంపల్లిలో రిజర్వాయర్ పూర్తి మట్టం వరకు నీరు చేరగానే లింక్-2 పంపుల ద్వారా మిడ్ మానేరుకు ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభమైంది. లింక్-2 పంపుల ద్వారా ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు, శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకంలో బిగించిన పంపుల వెట్న్ కోసం వరద కాలువకు ఎత్తిపోయడం జరిగింది. మిడ్ మానేరులో 15 టీఎంసీల నీరు నిండిన తర్వాత డ్యాం గేట్లను తెరచి లోయర్ మానేరుకు 10 టీఎంసీల నీటిని తరలించడం జరిగింది.
అదేవిధంగా శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం ట్రయల్ రన్ కోసం వరద కాలువకు నీటిని ఎత్తిపోయడం జరిగింది. ఈ నీరంతా ఎల్లంపల్లి నుంచి తీసుకున్నప్పటికీ ఆ నీరు కాళేశ్వరం నీరే తప్ప వేరే కాదు. ఎల్లంపల్లి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక ఆన్‌లైన్ జలాశయం. ప్రాజెక్టు రూపకల్పన సమయంలో ముఖ్యమంత్రి ఏ కలగన్నారో అది ఇవ్వాళ సాక్షాత్కారమైంది. జూన్, జూలైలలో వానలు లేక కరువు తాండవిస్తున్న సమయంలో గోదావరి నది 150 కి.మీ. పొడవున సజీవమైంది. గోదావరి నీరు మూడు బ్యారేజీలను దాటుకొని ఎల్లంపల్లికి ఎదురెక్కి వస్తుంటే ప్రజలు గోదావరి మాతకు జల నీరాజనం పట్టారు. కరువు కాలంలో గోదావరి ఇట్లా ఎదురెక్కిరావడం వారికి ఒక కొత్త అనుభవం. ఇక గోదావరి ఎండిపోయే పరిస్థితి ఎప్పటికీ రాదు.
అక్టోబర్ నుంచి వానలు కురువయి. అయితే దిగువ గోదావరిలో నీటి ప్రవాహాలు గణనీయంగా ఉంటాయి. ఎల్లంపల్లి సహా ఈ బ్యారేజీల్లో మొత్తం 56 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. కనుక వర్షాలు లేని కాలంలో, ఎగువన వరద లేని కాలంలో మేడిగడ్డ జలాశయం నుంచి నీటిని ఎత్తిపోయడం జరుగుతుంది. శ్రీరాంసాగర్ ఆయకట్టుకు, 2019 యాసంగి పంటలతో పాటు చెరువులకూ కాళేశ్వరం నుంచే నీటి సరఫరా జరిగింది. వందేండ్లకోసారి కురిసే వర్షాలు వచ్చినందున 2020లో కాళేశ్వరం పంపులను తిప్పే అవసరం రాలేదు. ఇప్పుడు యాసంగి అవసరాలకు మేడిగడ్డ నుంచి పంపింగ్ మొదలైంది. పైనుంచి వరద వస్తున్నప్పుడు పంపులను తిప్పుమనేవాడు మూర్ఖుడు కాక మరేమవుతాడు? వర్షాలు లేని కాలంలో కూడా నీటిని సరఫరా చేసే సదుపాయం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నది. అది కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్-1కు ఉన్న ప్రాధాన్యం. ఈ సంగతి గోదావరి ఎదురెక్కి వస్తున్న సందర్భంలోనే ప్రజలకు అర్థమైంది. విమర్శకులు మాత్రం వెనుకబడిపోయారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు.
ఈ ప్రాజెక్టులో నార్లాపూర్ వద్ద ఉన్న మొదటి పంప్‌హౌజ్‌లో మొత్తం 8 పంపులున్నాయి. ఒక్కొక్కటి 145 మెగావాట్ల రేటింగ్. ఒక్కో పంపు 3 వేల క్యూసెక్కులు. మొత్తం రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం వీటిది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. నార్లాపూర్ పంప్‌హౌజ్‌లో ఉన్న 8 పంపుల్లో 2 పంపులు 802 అడుగుల వద్ద, మిగతా 6 పంపులు 820 అడుగుల వద్ద బిగించడానికి ప్రతిపాదించారు. 802 వద్ద రెండు పంపులే పెట్టడానికి కారణం ఆ మట్టం వద్ద శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ రెండు పంపులకు మాత్రమే సరిపోతుంది. 820 అడుగుల వద్ద అన్ని పంపులు తిరుగుతాయి శ్రీశైలం వరద మట్టం 885 అడుగులు. పంపులు బిగించిన మట్టం 802, 820 అడుగులు. 820 అడుగుల పైన శ్రీశైలంలో 65 అడుగుల నీటి నిల్వ ఉంటుంది. వరదకు అందనంత ఎత్తులో పంపులు బిగించారన్నది ఎంతటి మూర్ఖపు మాటనో, ఎంతటి అవగాహనా రాహిత్యంతో అన్న మాటనో తెలిసిపోతున్నది.
–శ్రీధర్‌రావు దేశ్‌పాండే
Tags harish rao tanneeru irrigation kcr kcrmkaleshwaram ktr Officer On Special Duty to CM slider Sridhar Rao Deshpande telan gana governament telanganacm telanganacmo thanneeru harish rao trs governament TS at Irrigation & C.A.D.Department