రాష్ట్రంలోని అన్ని కులాల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. జుక్కల్ నియోజకవర్గం పిట్లంలో కుల్లగడగి/కుల్లె కడిగి/చిట్టెపు రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనం, కృతజ్ఞత సభా ఆదివారం జరిగింది. ఈ సభకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని కులాల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తొందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని అనేక రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు.
కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కేవలం కొద్ది సంవత్సరాలల్లోనే కట్టిన ఘనత సీఎం కేసీఆర్‌ది అన్నారు. వరి పంట విషయంలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్ తో పోటీ పడుతోందని తెలిపారు. కుల్లగడగి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిట్టెపు శివసాయి పటేల్ తెలంగాణ ఉద్యమ కాలం నుండి సీఎం కేసీఆర్ వెంట నడిచారన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో, బీసీ కమిషన్ అధ్యయనం తరువాత చిట్టెపు కులాన్ని రాష్ట్ర ప్రభుత్వం బీసీల్లో చేర్చిందని గుర్తు చేశారు.
ఎమ్మెల్యే హన్మంత్ షిండే పట్టుదల కారణంగానే పిట్లం మండలానికి సీఎం కేసీఆర్ ‘నాగమడుగు’ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశారన్నారు. జుక్కల్ అభివృద్ధిలో వంద శాతం తన పాత్ర ఉంటుందని కవిత అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పరిష్కారం కాని సమస్యలను ప్రత్యేక రాష్ట్రంలో అనతికాలంలోనే పరిష్కరించామన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం కాకుండా, ముందు తరాల వారికి ఉపయోగిపడటమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్నఅన్ని సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ కవిత కుల్లగడగి కులస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే హన్మంత్ షిండే, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.