కవులు, రచయితలను గుర్తించి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ ఒక్కరికే దక్కుతుందని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. 25 ఏండ్లలో కవులను, రచయితలను ఎవరూ గుర్తించలేదని, తన పాట, కవిత, రచనలను గుర్తించి ముఖ్యమంత్రి తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారని చెప్పారు.
హైదరాబాద్‌లోని మలక్‌పేట ‘బీ’ బ్లాక్ ముంతాజ్ కళాశాలలో ప్రిన్సిపాల్, కవి యాకూబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రొట్టమాకురేవు కవిత్వ అవార్డు-2020 (షేక్ మహమ్మద్ మియా, కేఎల్ నర్సింహారావు, పురిటిపాటి రామిరెడ్డి స్మారక కవితా పురస్కారాలు) ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు.
రొట్టమాకురేవు కవిత్వ అవార్డుకు సాహితీలోకంలో చాలా ప్రాముఖ్యత, ప్రశస్తి ఉన్నదని చెప్పారు. ఈ సందర్భంగా కోడూరి విజయకుమార్ (రేగుపండ్ల చెట్టు), మెర్సీ మార్గరేట్ (కాలం వాలిపోతున్న వైపు), అనిల్‌డాని (స్పెల్లింగ్ మిస్టేక్), మెట్టా నాగేశ్వర్‌రావు రాసిన (మనిషొక పద్యం) కవితా రచనలకు అవార్డులను అందుకున్నారు. కార్యక్రమంలో సభాధ్యక్షుడు ప్రసేన్, కేంద్ర సాహిత్య అకాడమీ కన్వీనర్, అవార్డు గ్రహీత కే శివారెడ్డి, నారాయణశర్మ పాల్గొన్నారు.