పల్లె ప్రగతి కార్యక్రమ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాల్లో అద్భుతంగా పనులు జరుగుతున్నాయని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక కృషి చేసి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని ముఖ్యమంత్రి అభినందించారు.
మంత్రి దయాకర్ రావుతోపాటు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందన్ రావు, ఇతర అధికారులను ముఖ్యమంత్రి ప్రశంసించారు.
ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేక శ్రద్ధతో పల్లె ప్రగతి పనులను పర్యవేక్షిస్తున్నారని, గ్రామ సర్పంచ్ లు, గ్రామ కార్యదర్శులు ఎంతో శ్రమకోర్చి పనులు చేస్తున్నారని సీఎం కేసీఆర్ అభినందించారు.
సంగారెడ్డి కలెక్టర్ కు సీఎం ప్రశంస :
అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాలు నిర్మించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని నూటికి నూరుశాతం నెరవేర్చిన సంగారెడ్డి కలెక్టర్ మంత్రిప్రగడ హన్మంతరావును ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు.
జిల్లాలోని మొత్తం 647 గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించి, వాటిని అందుబాటులోకి తెచ్చారని సీఎం అన్నారు. సంగారెడ్డి జిల్లాను ఆదర్శంగా తీసుకొని మిగతా జిల్లాల్లో కూడా వందకు వందశాతం వైకుంఠధామాలు నిర్మించాలని సీఎం కోరారు