ఆసీస్తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ చేజారకుండా.. టీమిండియా ఆటగాళ్లు హనుమ విహారి, అశ్విన్ అద్భుత పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారు. వీరి పోరాటం కారణంగా మూడో టెస్ట్ డ్రా అయ్యింది. 272 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో.. హనుమ, అశ్విన్ ఇద్దరూ కలిసి మరో వికెట్ పడకుండా వికెట్లకు అడ్డుపడ్డారు. ఈ ఇద్దరూ.. నాటి లక్ష్మణ్, ద్రవిడ్ జోడీని గుర్తు చేశారు.
వీరిద్దరూ కలిసి 258 బంతులాడి 62 పరుగులు చేశారు. దీంతో రెండో ఇన్నింగ్సులో 131 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా 334 పరుగులు చేసింది. విజయానికి మరో 73 పరుగులు చేయాల్సి ఉండగా ఐదో రోజు ఆట ముగిసింది. దీంతో మూడో టెస్టు డ్రా అయ్యింది. నాలుగు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. బ్రిస్బేన్లో జరగబోయే నాలుగో టెస్టుతో సిరీస్ ఫలితం తేలనుంది. ఆరో వికెట్ పడకుండా.. సుదీర్ఘంగా ఇన్నింగ్స్ ఆడిన జోడీగా రికార్డులకెక్కారు. ఆసీస్ బౌలర్లలో హాజిల్ వుడ్, లియాన్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, కమ్మిన్స్ ఒక వికెట్ తీసుకున్నాడు.
ఇదిలా ఉంటే, టీమిండియా మాజీ ఆటగాడు, గ్రేట్ వాల్ ఇండియాగా అభిమానులు పిలుచుకునే రాహుల్ ద్రవిడ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఇద్దరూ కలిసి అద్భుతమైన కానుక ఇచ్చారంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.
ఆస్ట్రేలియా: 338, 312 డిక్లేర్డ్
భారత్: 244, 334/5