ఎల్బీనగర్ నియోజకవర్గంలో తాగునీటి కష్టాలు తీర్చేందుకు మరో రెండు భారీ అధునాతన రిజర్వాయర్లు అందుబాటులోకి వచ్చాయి. శనివారం రూ. 9.42 కోట్ల వ్యయంతో నిర్మించిన భారీ 2.5ఎంఎల్ కెపాసిటీ గల రెండు మంచినీటి రిజర్వాయర్లను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.
హడ్కో నిధులు రూ. 325 కోట్లతో ఎల్బీనగర్ నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన 11 రిజర్వాయర్లలో ఈ రెండు చివరివి. నూతనంగా నిర్మించిన 11 రిజర్వాయర్లలో 9 రిజర్వాయర్లను 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందే మంత్రి కేటీఆర్ సాహెబ్‌నగర్ జలమండలి కార్యాలయంలో ప్రారంభించారు. తాజాగా మోహన్‌నగర్ జంట రిజర్వాయర్లు శనివారం ప్రారంభించారు. 2016లో ప్రారంభమైన రిజర్వాయర్ల నిర్మాణం ప్రస్తుతం పూర్తి చేసుకుని ప్రజలకు తాగునీటిని అందిస్తున్నాయి.
తాజాగా మోహన్‌నగర్‌లోని రెండు 2.5 ఎంఎల్ కెపాసిటీ రిజర్వాయర్లు అందుబాటులోకి వచ్చాయి. ఎల్బీనగర్ పదో డివిజన్ పరిధిలో గతంలో 41.3 మిలియన్ లీటర్ల కెపాటిసీ గల పది రిజర్వాయర్లు అందుబాటులో ఉండగా నూతనంగా నిర్మించిన మరో 11 రిజర్వాయర్లను 55.5 మిలియన్ లీటర్ల కెపాసిటీతో అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మొత్తంగా 19 రిజర్వాయర్ల ద్వారా తాగునీటి సరఫరా జరుగుతుండగా తాజాగా రెండు రిజర్వాయర్లు అందుబాటులోకి రావడంతో మొత్తం 21 రిజరాయర్ల ద్వారా నీటి సరఫరా జరుగనుంది. ఈ రిజర్వాయర్ల నిర్మాణానికి తోడు నీటి సరఫరా కోసం అదనంగా 365 కిలోమీటర్ల మేర పైపులైన్ పనులు కూడా పూర్తి చేశారు.
15,900 కనెక్షన్లకు నీటి సరఫరా..
మోహన్‌నగర్‌లోని జంట రిజర్వాయర్లు అందుబాటులోకి రావడంతో.. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కొత్తపేట, చైతన్యపురి డివిజన్లతో పాటుగా మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కేపురం డివిజన్‌లోని సుమారు 40 కాలనీల్లో ప్రస్తుతం జరుగుతున్న నీటి సరఫరా మరింత మెరుగు కానుంది.