బాగ్‌లింగంపల్లిలోని లంబాడీ తండాలో కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. లంబాడీ తండాలో డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభించుకోవడంతో మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆత్మకు శాంతి చేకూరుతుందని పేర్కొన్నారు. పండుగ వాతావరణంలో ఇండ్ల పంపిణీ జరగడం సంతోషకరమన్నారు. లంబాడీ తండాలో రూ. 10 కోట్ల 90 లక్షలతో 126 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నామని తెలిపారు. ఒక్కో ఇంటిపై రూ. 9 లక్షలు ఖర్చు చేశామన్నారు. ఈ ఇండ్లను కిరాయికి ఇవ్వడం, అమ్మడం లాంటివి చేయొద్దు. పేదలపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా ఇండ్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. మార్కెట్లో రూ. 50 లక్షలు ధర పలికేలా ఇండ్లను పేదలకు కట్టించి ఇస్తున్నాం. పేదలు ఆత్మగౌరవంతో బతికేలా సకల సౌకర్యాలతో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టామన్నారు.
స్లమ్ ఫ్రీ నగరం కోసం కృషి
దేశంలో ఏ నగరంలో లేని విధంగా.. స్లమ్ ఫ్రీ నగరం కోసం కృషి చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. మీ పరిసరాలను మీరే పరిశుభ్రంగా ఉంచుకోవాలని లబ్దిదారులకు సూచించారు. దేశం గర్వపడే కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఏ రాష్ర్టంలో లేని విధంగా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నామని చెప్పారు. రూ. 18 వేల కోట్లతో రాష్ర్టంలో 2 లక్షల 72 వేల ఇండ్లు నిర్మిస్తున్నామని తెలిపారు.
పట్టాలు ఇప్పించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి
డిఫెన్స్ భూముల్లో పట్టాలు ఇప్పించేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృషి చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ఎలా ఉన్న ఎన్నికల తర్వాత అభివృద్ధి కోసం అందరం కలిసి సమన్వయంతో పని చేయాలి. రాజకీయాల్లో పోటీ ఉండాలి కానీ, కొట్లాటలు సరికాదు అని కేటీఆర్ పేర్కొన్నారు.