తెలంగాణ రాష్ట్రం వస్తేనే పడావు భూములకు పచ్చదనం వస్తుందన్న శ్రీకాంతాచారి కలలు ఆయన స్వగ్రామం జనగామ జిల్లా గొల్లపల్లిలో కార్యరూపం దాల్చుతున్నాయి. దశాబ్దాలుగా వట్టిపోయిన వాగు జీవనదిలా పారుతున్నది. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నది. ఉన్న ఊరిలోనే ఉపాధి దొరుకుతుండటంతో వలసలు బందయినయ్. పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు పూర్తయి ప్రారంభానికి సిద్ధమైనయ్.
తమ బిడ్డకు నివాళిగా గ్రామస్థులు విగ్రహాన్ని ఏర్పాటుచేసుకున్నారు. గొల్లపల్లిని ఆనుకొని ఉన్న యశ్వంతాపూర్ వాగు దశాబ్దాలుగా వట్టిపోయింది. సీఎం కేసీఆర్ చొరవతో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దేవరుప్పుల మండలంలో ప్రవహిస్తున్న ఈ వాగుపై నాలుగు చెక్‌డ్యాం లు కట్టించారు. కొంతకాలం క్రితం కురిసిన వర్షాలకు చెక్‌డ్యాంలు నిండి గొల్లపల్లి వాగు నీటిప్రవాహంతో జీవనదిని తలపిస్తున్నది.
ఈ వాగుపైనే రూ.5 కోట్లతో మరో చెక్‌డ్యాం కూడా మంజూరైంది. దేవాదుల కాలువల ద్వారా నవాబుపేట, ఘనపురం రిజర్వాయర్ల నుంచి మండలంలోని 95 శాతం చెరువులు మూడేండ్లుగా మత్తళ్లు పోస్తున్నాయి. ఇండ్లులేని వారికోసం శ్రీకాంతాచారి కాలనీ పేరిట డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేపట్టారు. గురువారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆ ఇండ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు.