ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కేసు నమోదు చేస్తాం.. ఒక మతాన్ని, ప్రాంతాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న ఆయన వ్యాఖ్యలు సరికాదు.. న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నాం.. విద్వేష వ్యాఖ్యలు చేసిన అందరిపైనా కేసులు పెడతాం’ అని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. పోలీస్ డ్యూటీ మీట్ సందర్భంగా తిరుపతిలో బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు.
సీఎంగా సుదీర్ఘ కాలం పనిచేసిన చంద్రబాబు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని.. తన మతం, ప్రాంతం గురించి మాట్లాడటం బాధించిందని చెప్పారు. నార్త్ ఈస్ట్ నుంచి వచ్చాడంటూ తనపై గతంలో వ్యాఖ్యలు చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు సీఎం, హోం మంత్రి, తాను.. ముగ్గురం క్రైస్తవులం గనుక హిందువులకు రక్షణ లేదన్నట్లు వ్యాఖ్యలు చేయడం రెచ్చగొట్టడమేనని అన్నారు.
మతాలను రెచ్చగొట్టేలా మాట్లాడిన ఎవరినీ వదిలి పెట్టబోమన్నారు. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న ఘటనలు చూస్తుంటే శాంతిభద్రతలకు భంగం కలిగించేలా కుట్రలు చేస్తున్నారన్న అనుమానం ఉందని చెప్పారు. ‘దొంగలు, ఆకతాయిలు చేస్తున్నట్లు అనిపించడం లేదు.ఘటనల్లో పోలిక ఉన్నందున కుట్ర కోణం ఉన్నట్లు అనుమానం కలుగుతోంది. బాధ్యులెవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని అన్నారు.