తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,500 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రజారోగ్యశాఖ సంచాలకుడు గడల శ్రీనివాసరావు తెలిపారు. వైద్యారోగ్యశాఖ సిబ్బందికి తొలివిడుతలో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.
సాంకేతిక సమస్యలు, వ్యాక్సిన్ నిల్వ, పంపిణీ, వ్యాక్సినేటర్ల తయారీ తదితర అంశాలపై సన్నద్ధమయ్యేందుకు గురు, శుక్ర వారాల్లో రాష్ర్ట వ్యాప్తంగా డ్రైరన్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని ఏడు కేంద్రాల్లో నిర్వహించిన డ్రైరన్ విజయవంతమైందని తెలిపారు.
ఈ క్రమంలో ఏర్పడ్డ సమస్యలకు పరిష్కారం చూపేందుకు జిల్లా, మండల స్థాయిలో ఏర్పడ్డ టాస్క్‌ఫోర్స్ కమిటీలు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో ఇప్పటివరకు సుమారు 2.90లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల సిబ్బంది నమోదు పూర్తయిందని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా ఎవరు కూడా వ్యాక్సిన్ వల్ల ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు లేవని చెప్పారు.