తెలంగాణలో ఖమ్మం అభివృద్ధిలో రోల్ మోడల్‌గా ఉండాలని.. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువస్తూ తపన పడుతుంటే మండల సమావేశానికి రావడానికి సర్పంచ్‌లకు, ప్రజాప్రతినిధులకు తీరిక లేదా అంటూ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంతో బాధ్యతో గెలిపించి గ్రామాభివృద్ధి చేయాలని బాధ్యతలు అప్పగిస్తే నిర్లక్ష్యం వహిస్తే ఎలా అని ఆయన మండిపడ్డారు. సోమవారం జిల్లాలోని రఘునాధపాలెం మండలం సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
సాధారణ సర్వసభ్య సమావేశానికి వచ్చిన అధికారులు పనుల పురోగతిలో వివరాలను తెలియజేయడంతో నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజా ప్రతినిధులు కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి విషయంలో గ్రామాలను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు అధికారులపై ఉందని ఆయన అన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ స్నేహలత, ఖమ్మం మార్కెట్ చైర్మన్ వెంకటరమణ, పలువురు సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు.