Home / EDITORIAL / నేడు సావిత్రిబాయి ఫూలే జయంతి

నేడు సావిత్రిబాయి ఫూలే జయంతి

మహాత్మా జ్యోతీరావు ఫూలే భార్య. పెళ్లి నాటి నుండి ఫూలే పనుల్లో తానూ కూడా పాల్గొంది. నైగావ్ ( మహారాష్ట్రలోని సతారాజిల్లాలోని ఖండాలా మండలం)లో జన్మించింది. చిన్న పల్లెటూరు. ఒక విధంగా చెప్పాలంటే కుగ్రామం. పాటిల్ గారి పెద్దకూతురు. మొదటి సంతానం. ఆనాడు చేలలో పరిగెత్తుతూ ఆ గులక రాళ్లను, దుమ్మునూ తన్నుకొంటూ ముళ్ళు గిళ్ళూ లెక్కచేయకుండా తన బాల్యాన్ని గడిపింది. తన విరబోసుకొన్న జుట్టు ముఖం మీద పడుతోంటే వెనక్కి తోసుకొంటూ ఊరంతా వెర్రిగా పరిగెత్తేది. చింతకాయలు కొట్టుకు తినడం, రేగిపళ్ళు కోసుకుతినడంలో ఆమెను మించిన వాళ్ళు లేరు. ఆరోజుల్లో ఆడవాళ్లు గడప దాటకూడదు. ఆడపిల్ల పెరిగి పెద్దయ్యేసరికి లక్ష్మణుడు గీసిన గీత దాటటం వల్లనే సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకుపోయాడనే కథ ఎన్ని వందలసార్లు విన్నదో. ఆడదంటే వంటింటికీ, వంటింట్లో పొయ్యికీ కట్టుబడి ఉండాలి. పొయ్యిలో కట్టెలు, పొయ్యి ఊదే గొట్టం, ఆ పిల్లచేతిలో ఉండాల్సిందే. రెండో తరగతి నాటికే అత్తగారింట్లో వుండేవాళ్ళు ఆడవాళ్లు.

అత్తామామలు సావిత్రిబాయిని చాలా చక్కగా చూసుకొనేవాళ్ళు. ఇక ఫూలే ( సేట్ జీ ) కి ఎప్పుడూ బడీ, పుస్తకాలు, చదువు. ఇదే ప్రపంచం. ఇంతింత లావు పుస్తకాలు ముందేసుకుని ఎప్పుడూ చదువుతూనే ఉండేవాడు ఫూలే. రాస్తూనే ఉండేవాడు. వాళ్ళ పంతులుగారికి ఈయనంటే పరమ ఇష్టం. సావిత్రీబాయి ఫూలేని సేట్ జీ అని పిలవడానికే ఇష్టపడేది. శివాజీ, వాషింగ్ టన్ గురించిన జీవిత చరిత్రలు, ‘ థామస్ పెన్ రాసిన’ మానవుని హక్కులు వంటి పుస్తకాలలో ఉన్న విషయాలను ఫూలే సావిత్రిబా యితో చర్చించేవాడు. ప్రపంచం గురించి, హిందూ ముస్లిం మతాల మధ్య ఉన్న తేడాలేమిటి ? క్రైస్తవమతం, మనిషిని గురించి ఏం చెబుతుంది ? మన కుల వ్యవస్థ మన సమాజాన్ని యెట్లా నాశనం చేస్తుందో చెప్పేవాడు. వీటన్నిటి గురించి సేట్ జీ మాట్లాడుతుంటే చెవులు రిక్కించుకొని వినేది సావిత్రి. కబీర్, తుకారాం, జ్ఞానేశ్వర్ వంటి భక్తుల సాహిత్యం, భక్తిమార్గాన్ని గురించి, బుద్ధుడు, బసవేశ్వరుడు, తీర్ధంకరుడు మొదలైన మత సంస్కర్తల రచనలన్నీ చదివి సావిత్రికి చెప్పేవాడు. ఇవన్నీ మనకెందుకు అని అడిగిన సావిత్రీతో ” ఒకప్పుడు మంచిగా వుండే మతం మూర్ఖపు ఆచారాలలో, సంప్రదాయాలలో చిక్కుకుపోయింది. వీటన్నిటినీ రూపుమాపాలి ” ఈ దరిద్రపు ఆచారాలన్నీ ఎక్కువ తక్కువ కులాలనే విభజన వల్లే వచ్చాయి.

మామూలు మనుషులందరికీ చదువు ఎందుకుండగూడదు ? అని సావిత్రిలో ఆలోచనను రేకెత్తించాడు ఫూలే. అప్పటినుండి చదవడం, రాయడం వంటి విషయాలలో సావిత్రికి స్పష్టత వచ్చింది. అక్షరాలు, మాటలు, వాక్యాలూ, గొబ్బిళ్ళ పాటలూ అన్నీ చాలా ఇష్టంగా నేర్చుకొంది సావిత్రి. ఈ విషయంలో తన మామ నుండి వ్యతిరేకత వ్యక్తమైంది. “ఆడదానికి చదువు పనికి రాదు. చదువుకొన్న ఆడది చెడిపోతుంది.బుద్ధిలేనిదవుతుంది” అన్న మామ గారి మాటలకు ఇద్దరూ ఎదురు చెప్పారు. ఇల్లు వదిలి వెళ్లిపోయారు.

సేట్ జీ తక్కువ కులాల ఆడపిల్లల కోసం ఒక బడి పెట్టాడు. కేశవరావు భవాల్కర్ , జగన్నాద్ సదాశివ్, అన్నాశాస్త్రి బుద్దే, బాపురావుజీ, విష్ణు మోరేశ్వర్, భిడే కృష్ణశాస్త్రి, చిప్ లూన్కర్ మొదలైన వాళ్ళతో బడి బాగా నడుస్తోంది. సావిత్రీకి ఇష్టం లేక పోయినా భర్త ఫూలే ప్రోత్సాహంతో పిల్లలకు చదువు చెప్పే టీచర్ గా మారిపోయింది. తాను బడికి పోతుంటే జనం కిటికీల వెనక నిలబడి తిట్టేవారు. శాపనార్ధాలు పెట్టేవారు. నీచమైన మాటలన్నీ అనేవారు. బడికి వెళ్ళగానే అక్కడ తలుపులు కిటికీలు మూసేది. తరగతి లోపల పిల్లలకు నీతిపద్యాలు, కూడికలు, తీసివేతలు, భూగోళ శాస్త్రం, మరాఠా చరిత్ర ఇవన్నీ చెప్పేది. సేట్ జీ మాల మాదిగల పేటలకు వెళ్లి చదువు ఎంత అవసరమో ప్రచారం చేస్తుండేవాడు.

ఒక బిడ్డను దత్తత తీసుకొని స్వంత కొడుకులాగానే పెంచారు. మానవత్వం, కులం, ఆదర్శాలు, ఆలోచనలు వంటి వాటిపై సావిత్రీ కి చాలా స్పష్టత వచ్చింది. సత్యశోధక్ సమాజ్ స్థాపనతో కుల మతాలకు అతీతంగా వివాహాలు జరిపించేది. సావిత్రీ తన మనస్సులో ఎప్పుడూ ” మా తరువాత ఈ ప్రజలు మా విజయాలను ముందుకు తీసుకు వెళుతున్నారా ? లేక వాటిని అక్కడే భూస్థాపితం చేసి జీవం లేకుండా చేస్తున్నారా ? ” అని.

ఫూలే ఆరోగ్యం క్రమ క్రమంగా క్షీణించింది. పక్షవాతం వచ్చింది. అందరూ అఖండ్ ( ప్రార్ధన ) పాడుతుండగా సేట్ జీ తన యాత్రను ముగించాడు. ” సత్యమేవ జయతే – అఖండ సత్యం ” అనుకొంటూ ఫూలే అంతిమ యాత్రను దగ్గరుండి నడిపించారు సావిత్రీబాబు. 1897 లో పూనాలో ప్లేగు వ్యాధి ప్రబలింది. ఈ వ్యాధి సోకిన పిల్లలను దగ్గరుండి చూసుకుంది సావిత్రి. ఈమెకు కూడా ప్లేగు వ్యాధి సోకింది. ఈమె ప్రయాణం పరిసమాప్తమైంది. ” నేను పనిలో ఉండగా మృత్యువు నన్ను వరించడం నా అదృష్టం “అని నిత్యం పనిని ప్రేమించే మన విశ్వాసాన్ని పెంచిన భారత దేశ మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి ఫూలే 189వ జయంతి సుభాకాంక్షలు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat