తెలంగాణలోని ప్రభుత్వంలోని అన్ని రకాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొత్త సంవత్సరం సందర్భంగా బొనాంజా ప్రకటించారు. అన్ని శాఖల్లో.. అన్ని క్యాటగిరీల్లో పనిచేస్తున్న ప్రభుత్వోద్యోగులందరికీ వేతనాలు, ఉద్యోగ విరమణ వయోపరిమితిని పెంచాలని, అన్ని ప్రభుత్వ శాఖల్లో పదోన్నతులు ఇచ్చి.. ఖాళీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించారు.
ప్రభుత్వోద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్క్ చార్జ్‌డ్, డైలీ వేజ్, ఫుల్‌టైమ్ కంటింజెంట్, పార్ట్‌టైమ్ కంటింజెంట్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్‌వాడీ వర్కర్లు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, ఆశావర్కర్లు, విద్యావాలంటీర్లు, సెర్ప్
ఉద్యోగులు, గౌరవవేతనాలు అందుకొంటున్న వారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాలను పెంచుతామని వెల్లడించారు. రాష్ట్రంలో అన్నిరకాల ఉద్యోగులు 9,36,976 మంది ఉంటారని, వీరందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని చెప్పారు. ఆర్టీసీలో కూడా వేతనాలను పెంచాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. అవసరమైతే వేతనాల పెంపువల్ల ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.