తెలుగు ఇండస్ట్రీపై లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ వేసిన ముద్ర అంత ఈజీగా మరిచిపోలేం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి మూడు వరుస విజయాలతో రచ్చ చేసాడు ఈయన. అప్పట్లో ఉదయ్ కిరణ్ మార్కెట్ చూసి ఇప్పటి స్టార్ హీరోలు కూడా జడుసుకున్నారు. ఎక్కడ్నుంచి వచ్చాడు ఈ కుర్రాడు.. సముద్రం లాంటి ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టిస్తున్నాడు అంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపు ఉదయ్ కిరణ్ సూపర్ స్టార్ అయిపోయాడు. కానీ అంతే త్వరగా నేలకు పడిపోయాడు కూడా. వరస విజయాలతో సంచలనాలు రేపిన ఉదయ్.. ఆ తర్వాత కనీసం గుర్తు కూడా పెట్టుకోలేనంత దారుణంగా కెరీర్ లో వెనకబడిపోయాడు. దానికి కారణాలు ఏవైనా కూడా ఈ మానసిక ఒత్తిడితోనే 2014లో చనిపోయాడు.
ఆయన చనిపోయి ఏడేళ్ళు కావొస్తున్నా కూడా ఇప్పటికీ ఉదయ్ కిరణ్ ను మరిచిపోలేకపోతున్నారు అభిమానులు. ఆయన గురించి ఏ వార్త వచ్చినా కూడా ఆసక్తిగా చూస్తుంటారు. ఇప్పుడు ఆయనతో తనకు ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నాడు దర్శకుడు విఎన్ ఆదిత్య. అప్పట్లో ఈయనతో మనసంతా నువ్వే, శ్రీరామ్ సినిమాలు చేసాడు ఈ దర్శకుడు. అందులో మనసంతా నువ్వే 2 కోట్లతో చేస్తే 16 కోట్ల షేర్ వసూలు చేసింది. శ్రీరామ్ కూడా బాగానే ఆడింది. ఈ సినిమా నిర్మాతకు మంచి ప్రాఫిట్స్ తీసుకొచ్చింది. ఆ తర్వాత కూడా ఉదయ్ కిరణ్, ఆదిత్య కాంబినేషన్ లో సినిమాలు వచ్చేవే కానీ అనుకోని కారణాలతో ఆగిపోయాయి. ఇదిలా ఉంటే తొలి మూడు సినిమాలు బ్లాక్‌బస్టర్ కావడంతో ఇప్పుడు కానీ అలాంటిది జరిగుంటే ఉదయ్ కిరణ్ మార్కెట్ 400 కోట్లు ఉండేదని చెప్పుకొచ్చాడు ఆదిత్య. ఎందుకంటే అప్పట్లో ఆయన సాధించిన విజయాలు అలాంటివి మరి.
చిత్రం లక్షల్లో తీస్తే కోట్లు వసూలు చేసింది. నువ్వు నేను కోటిన్నరతో తీస్తే 14 కోట్లు షేర్ వసూలు చేసింది. మనసంతా నువ్వే 2 కోట్లు పెడితే 16 కోట్లు షేర్ తీసుకొచ్చింది. ఇలాంటి లాభాలు ఏ హీరోకు వస్తాయి చెప్పండి అంటున్నాడు ఆదిత్య. అందుకే ఉదయ్ కిరణ్ రేంజ్ తన దృష్టిలో 400 కోట్లు అంటున్నాడు. అలాంటి ఉదయ్ కిరణ్ అంత త్వరగా చనిపోవడం మాత్రం నిజంగానే అందరికీ షాక్ అంటున్నాడు ఈయన. ఉదయ్ చనిపోడానికి వారం ముందు అంటే జనవరి 1, 2014 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా బెంగళూరులో తన భార్యతో పాటు పబ్‌లో ఉండి తనకు ఫోన్ చేసాడని చెప్పాడు ఆదిత్య. రాత్రంతా తనతో మాట్లాడాడని.. కానీ అది జరిగిన నాలుగు రోజులకే జనవరి 5న ఈయన హైదరాబాద్ లోని తన ఫ్లాట్ లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉదయ్ కిరణ్ ఆత్మహత్య మాత్రం సంచలనమే. కానీ ఓ క్షణం ఆలోచిస్తే నిజంగానే ఉదయ్ కిరణ్‌లా విజయాలు అందుకుంటే 400 కోట్ల మార్కెట్ తక్కువే అవుతుందేమో..?