రష్మిక మందన్న పాన్ ఇండియా కథానాయికగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కన్నడ, తెలుగు భాషల్లో అగ్ర నాయికగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఈ సుందరి..ప్రస్తుతం హిందీ చిత్రసీమపై దృష్టి పెట్టింది.
పీరియాడికల్ స్పై థ్రిల్లర్ ‘మిషన్ మజ్ను’ ద్వారా రష్మిక మందన్న బాలీవుడ్‌లో అరంగేట్రం చేయబోతున్న విషయం తెలిసిందే. సిద్ధార్థ మల్హోత్రా కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా తాలూకు ఫస్ట్‌లుక్‌ను ఈ మధ్యే విడుదల చేశారు. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలావుండగా రష్మిక మందన్న హిందీలో మరో బంపరాఫర్‌ను దక్కించుకుంది.
బిగ్‌బి అమితాబ్ బచ్చన్ సరసన ఓ ముఖ్య పాత్రలో ఆమె నటించబోతున్నది. ఈ చిత్రానికి వికాస్‌భల్ దర్శకత్వం వహిస్తారు. తండ్రీకూతురు అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా కథాంశం సాగుతుందని సమాచారం. ఇందులో అమితాబ్ కూతురి పాత్రలో రష్మిక మందన్న నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో ‘పుష్ప’ చిత్రంలో నటిస్తోంది.