తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కల సాకారమవుతున్నది. హరిత తెలంగాణ దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం సత్ఫలితాలనిస్తున్నది. అంతరించిపోతున్న అడవులు తిరిగి ఆకుపచ్చగా కళకళలాడుతున్నాయి.
మహబూబాబాద్ జిల్లా గంగారం, కొత్తగూడ, గూడూరు, బయ్యారం, గార్ల మండలాల్లో ఉన్న అటవీ ప్రాంతాల్లో చేపట్టిన బ్లాక్ ప్లాంటేషన్‌తో ఈ ఐదేండ్లలో సుమారు 17వేల ఎకరాల్లో అటవీ విస్తీర్ణం పెరిగింది.
దాదాపు 68.81 లక్షల మొక్కలు నాటగా ఏపుగా పెరిగి అటవీ ప్రాంతం దట్టంగా మారడంతో వన్యప్రాణుల సంఖ్య విపరీతంగా పెరిగింది. వలస వెళ్లిన జంతువులు సైతం తిరిగి వస్తున్నాయి. అడవి దున్నలు, చుక్కల దుప్పులు, కొండ గొర్రెలు, మనుబోతులు, ఎలుగు బంట్లు ఇప్పుడు సందడి చేస్తున్నాయి. రెండు నెలల క్రితం గూడూరు, గార్ల మండలాల పరిధిలో పులి సంచరించినట్టు గుర్తించారు. వన్య ప్రాణులకు ఆవాసంగా మారడంతో తద్వారా వాటి సంతతి కూడా వృద్ధి చెందుతున్నది.