సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వివాహా ఏర్పాట్లను సంబంధిత అధికారులు దగ్గర ఉండి పర్యవేక్షించారు. సోమవారం వరుడి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కేశంపేట మండలం పాటిగడ్డ లూర్దుమాత చర్చిలో ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యూష, చరణ్‌రెడ్డి వివాహం క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరిగింది.
వివాహ మహోత్సవాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వ అధికారులతో పాటు వరుడి బంధువులు ఏర్పాట్ల పర్యవేక్షణలో జరిగాయి. ఈ వివాహానికి మహిళా సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యదేవరాజ్, ఐసీడీఎస్ ఉన్నత అధికారులు, షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తదితరులు హాజరయ్యారు. అదేవిధంగా వధువు ప్రత్యూష, వరుడు చరణ్‌రెడ్డి బంధువులు పాల్గొని ఇరువురిని ఆశీర్వదించారు.
వరుడు కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామానికి చెందిన ఉడుముల మర్రెడ్డి, జైన్‌మేరీ దంపతుల పెద్దకుమారుడు. చరణ్‌రెడ్డితో అక్టోబర్‌లో ప్రత్యూషతో హైదరాబాద్‌లో నిశ్చితార్థం జరిగింది. చరణ్‌రెడ్డి విదేశాల్లో విద్యను పూర్తి చేసి హైదరాబాద్‌లోనే ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ప్రత్యూష కూడా విద్యను పూర్తిచేసి ఓ ప్రైవేట్ దవాఖానలో నర్స్‌గా విధులు నిర్వహిస్తున్నారు. చరణ్‌రెడ్డి పూర్తి వివరాలను తెలుసుకున్న రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ అధికారులు, సీఎం కేసీఆర్‌కు వివరించిన అనంతరం వివాహ తేదీని ఖరారు చేశారు. పాటిగడ్డ గ్రామంలోని లూర్ధుమాత చర్చిలో వివాహ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. వరుడి కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ అధికారులు హాజరయ్యారు.