నీళ్లు ఆ గ్రామస్వరూపాన్ని మార్చివేశాయి. కరువు ఛాలయను కడిగేశాయి. ప్రజల జీవన స్థితి గతులను మార్చివేశాయి. వలసలకు అడ్డుకట్ట వేశాయి. రెండేండ్లలోనే ప్రగతి పథంలో పరుగులు తీస్తున్నది తుంగతుర్తి నియోజకవర్గంలోని వర్ధమానుకోట గ్రామం. దశాబ్దాల తరబడి ఎండిపోయిన చెరువులు, నెర్రెబారిన నేలలు.. కరువు కాటకాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆ గ్రామం నేడు ఊహించనిస్థాయిలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ఉపాధి కోసం వలసబాట పట్టిన వారంతా తిరిగి సొంతగూడుకు చేరి చేతినిండా పనులతో బిజీగా మారిపోయారు. సాగు విస్తీర్ణం పెరిగిన ఫలితంగా పాడి పరిశ్రమ కూడా ప్రజలకు ఆదాయ వనరుగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు ఎస్సారెస్పీ కాల్వల ద్వారా బీడు భూములను సస్యశ్యామలం చేస్తుండగా రెండేండ్లలోనే తన స్వరూపాన్ని మార్చుకున్నది వర్ధమానుకోట.
కరువును తరిమేసిన గోదావరి జలాలు..
1468గృహాలు, 4355జనాభా కల్గిన వర్ధమానుకోట గ్రామం బిక్కేరు వాగుకు ఆనుకొని ఉంటుంది. తలాపున నీళ్లున్నా వాడుకోలేని పరిస్థితిలో దశాబ్దాల తరబడి కరువుతో అల్లాడిపోయింది. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల రాకతో కళకళలాడుతోంది. రెండేండ్ల కిందటి వరకు కేవలం మూడు వేల ఎకరాలు మాత్రమే సాగుచేసుకుంటున్న గ్రామస్తులు.. కాళేశ్వరం జలాల రాకతో మరో ఏడువేల ఎకరాలను అచ్చుకట్టారు. మొత్తం 10,589ఎకరాలు సాగుచేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
భారీగా వాహనాల కొనుగోళ్లు…
నాగారం క్రాస్‌రోడ్డు నుంచి వర్ధమానుకోటకు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీంతో అక్కడ బస్సు దిగి కాలినడకన ఇంటికి చేరుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆటోలను ఆశ్రయించాల్సిందే. ఏ చిన్న పనిపడినా 15కి.మీ.దూరంలో ఉన్న తిరుమలగిరికి వెళ్తుంటారు. తాజాగా ప్రజల ఆదాయం పెరగడంతో ద్విచక్రవాహనాల కొనుగోళ్లు పెరిగాయి. గ్రామంలో దాదా 1468ఇండ్లు ఉండగా బైకుల సంఖ్య 1200కు పైమాటే. గోదావరి జలాలు రాకముందు 150కి మించి బైకులు లేకపోగా నేడు పంటలు పండుతుండడం, వివిధ రకాలుగా ఉపాధి లభిస్తుండడంతో రైతులకు తక్కువ వడ్డీలకే రుణాలు దొరుకుతున్నాయి. బైకులు, ట్రాక్టర్లు కొనుగోలు చేస్తున్నారు.
అందివస్తున్న కాళేశ్వరం ఫలాలు
మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కృషి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ చొరవతో గోదావరి జలాలు నియోజకవర్గానికి చేరుకున్నాయి. దశాబ్దాల తరబడి కరువుకాటకాలు, రాజకీయ కక్షలతో కునారిల్లిన గ్రామాల్లో సాగు జోరందుకుంది. నియోజకవర్గ ప్రజల స్థితిగతులు నీటిరాకతో మారిపోయాయి.
శరవేగంగా నిర్మాణాలు…
వర్ధమానుకోటలో మూడు అంగన్‌వాడీ కేంద్రాలు, రెండు కమ్యూనిటీ హాళ్లను ప్రభుత్వం నిర్మించింది. దీనికి తోడు 2313మంది రైతులకు దాదాపు 3కోట్లకు పైగా రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి నగదు అందుతున్నది. సుమారు వెయ్యి మందికి వివిధ రకాల పింఛన్లు అందుతున్నాయి.. గతంలో గ్రామ సమీపంలో రెండు చెక్ డ్యాంలు ఉండగా తాజాగా ఎమ్మెల్యే కిశోర్ చొరవతో రూ.16కోట్ల వ్యయంతో బిక్కేరు వాగుపై మరో చెక్‌డ్యాం నిర్మించేందుకు పరిపాలన అనుమతులు లభించాయి. ఇవేగాకుండా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులు కుటుంబానికి ఒకరు చొప్పున ఉన్నారు. కరోనా కారణంగా ఇంటి వద్దనే ఉంటున్న పాఠశాల విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారు. హైస్కూల్‌లో 140మంది, రెండు ప్రాథమిక పాఠశాలల్లో మరో 210మంది ఉన్నారు. వీరంతా ఆన్‌లైన్ క్లాసుల కోసం స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్నారు.
ఆలయాలకు పూర్వ వైభవం…
గ్రామంలో అత్యంత పురాతన ఏకాంబరేశ్వరాలయం, శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం, అభయాంజనేయస్వామి దేవాలయం, వీరాంజనేయస్వామి దేవాలయంలతో పాటు ఓ మసీదు, చర్చి ఉన్నాయి. ప్రస్తుతం పాతవాటి పునరుద్ధరణతోపాటు కొత్తగా ఆలయాలను నిర్మిస్తున్నారు.
డైవర్ నుంచి ఓనర్‌గా..
గతంలో గ్రామంలో ఒక్క హార్వెస్టరే ఉండేది. గోదావరి జలాల రాకతో వ్యవసాయం పెరిగి గ్రామస్తులు మరో ఐదు వాహనాలు కొనుగోలు చేశారు. ఒక్కో మిషన్‌కు ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్లకు ఉపాధి దొరుకుతున్నది. గ్రామానికి చెందిన నర్సింగ్ కిష్టయ్య 2006నుంచి ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా ప్రస్తుతం హార్వెస్టర్ కొన్నాడు. తనతో పాటు మరో డ్రైవర్‌ను పెట్టుకొని సంపాదిస్తున్నాడు. ‘కేసీఆర్ నీళ్లతోనే నేను డ్రైవర్ నుంచి ఓనర్ అయిన’ అని కిష్టయ్య సంతోషంగా చెబుతున్నాడు.
చేతి నిండా పని..
గోదావరి జలాల రాకతో గ్రామంలో చిన్న, సన్నకారు రైతులు సైతం సొంతంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. చాలా మంది ఇండ్లు కట్టుకుంటున్నారు. దీంతో వ్యవసాయ సామగ్రి, ఇంటి తలుపులు, కిటికీల తయారీలో వడ్రంగులు బిజీగా గడుపుతున్నారు. నాగళ్లు, బురద గొర్రులు, కొత్తగా ఇండ్లు కట్టుకుంటున్న వాళ్లు దర్వాజలు, తలుపులు చేయిస్తుండడంతో పని బాగా దొరుకుతుంది. చిత్రంలో సామగ్రి తయారు చేస్తున్న బాణాల భిక్షపతి.
పిల్లలను సంతోషంగ చదివిస్తున్నా
వ్యవసాయం మీద వచ్చే ఆదాయంతో నా కొడుకులను మంచి కాలేజీలో బీటెక్ చదివిస్తున్నా. ఇలాంటి రోజులు వస్తాయని కలలో కూడా ఊహించలేదు. నాకు 14ఎకరాల భూమి ఉన్నాఏనాడూ నాలుగైదు ఎకరాలకు మించి సాగు కాలేదు. గోదావరి జలాలు వచ్చిన తర్వాత మొత్తం సాగు చేస్తున్నా. పంటలు బాగా పండుతుండడంతో ఆదాయం బాగున్నది.
– పడాల వెంకటేశ్వర్లు, రైతు
*
వ్యవసాయమే వద్దకున్నోన్ని ట్రాక్టర్ కొన్న…
ఇంతకుముందు గ్రామంలో పది ఎకరాలకు పైన భూమి ఉన్నోళ్లు మాత్రమే ట్రాక్టర్ కొన్నరు. కానీ, రెండేండ్లళ్ల 74ట్రాక్టర్లు పెరిగినయి. ఐదారు ఎకరాల భూమి ఉన్నోళ్లు కూడా ట్రాక్టర్ కొని పని అయిపోయినంక కిరాయికి తిప్పుతున్నరు. మాకు ఆరు ఎకరాలు ఉన్నది. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవాన్ని ఇపుడు ట్రాక్టర్ కొనుక్కోని ఇంకో ఆరు ఎకరాలు కౌలుకుతీసుకున్న. అసలు వ్యవసాయమే వద్దనుకున్న నేను గోదావరి నీళ్లు రావడంతోని ఆ ఆలోచన మానుకున్న. ట్రాక్టర్ కొనుక్కుంటానని కలలో కూడా అనుకోలే. గోదావరి నీళ్లే మా బతుకులు మార్చినయి.
– మద్దెల నవీన్, వర్ధమానుకోట
*
పెరిగిన పశు సంపద…
గ్రామం నలుదిక్కులా మూడు చెరువులున్నాయి. పెద్దిని, ముల్కల, మంచినీళ్ల చెరువులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. వలసలకు అడ్డుకట్టపడి కొద్దిపాటి భూమిని సైతం సాగు చేసుకుంటూ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. గ్రామంలో ట్రాక్టర్ల సంఖ్య రెండేండ్లలోనే 23నుంచి 95చేరింది. అలాగే ఆరు వరికోత యంత్రాలున్నాయి. పశుసంపద బాగా వృద్ధి చెందింది. ఆవులు, బర్రెలు, గొర్లు, మేకల సంఖ్య గణనీయంగా పెరిగింది. గ్రామంలో ఫర్టిలైజర్, కిరాణా షాపులు పెరిగాయి. ఫలితంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. ప్రస్తుతం 50నూతన గృహాలు నిర్మాణదశలో ఉన్నాయి. చాలామంది దశాబ్దాల కిందట నిర్మించిన ఇండ్లను పునరుద్ధరించుకుంటున్నారు.
*
నీళ్ల ధైర్యంతోనే బర్లుకొన్న..
గోదావరి నీళ్లు రావడంతో పచ్చిగడ్డికి బాధలేదనే ఆలోచన వచ్చి బర్లు కొన్న. ఊర్లో 12ఎకరాల భూమి మొత్తం వ్యవసాయం చేసుకుంటున్న. ఊర్లో చాలా మంది బర్లు, ఆవులు కొని మేపుకుంటున్నరు. పాడికి కొరతే లేదిప్పుడు.
– కాశీ వెంకటేశ్వర్లు, గ్రామస్తుడు
*
బొంబాయి నుంచి మళ్లొచ్చిన..
చేతిలో పైసల్లేక పనికోసం ముంబై పోయి పాలప్యాకెట్లు అమ్మిన. కూలి పని కోసం కార్లు కడిగిన. పుట్టిన ఊరికి దూరమైన అనే బాధ ఉండేది. కానీ, కేసీఆర్ నీళ్లు రాంగనే మళ్లా భార్య, పిల్లలతోని ఊళ్లొకి వచ్చిన. వానకాలం రెండు ఎకరాల్లో వరి పెడితే 80వేల రూపాయలొచ్చినయి. ఇంకో మూడు ఎకరాలు కౌలుకు దొరకబట్టిన. మిర్చి, పత్తి వేశాను. నీళ్లకు బాధలేదు. వ్యవసాయం పండుగైంది. ఇంక బొంబై పొయ్యే అవసరం లేదు. మా అమ్మనాయినతోని ఇక్కడే ఉంటుంటె ఎంతో సంతోషంగ ఉంది. ఏమిచ్చినా కేసీఆర్ రుణం తీర్చుకోలేం.
– ఈదేటి లింగయ్య