అంతర్జాతీయ స్థాయిలో పేరుగడించిన బాతిక్ చిత్ర కళాకారుడు యాసల బాలయ్య(82) మృతి పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాలయ్య మరణం చిత్రకళారంగానికి తీరని లోటని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బాతిక్ చిత్ర కళ ద్వారా బాలయ్య పల్లె జీవన సౌందర్యాన్ని కళ్ళకు కట్టారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలు, గ్రామీణ జానపద చిత్రాలను తన కుంచెతో ఆవిష్కరించిన బాతిక్ బ్రహ్మ యాసాల బాలయ్య మృతిచెందాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు.
సిద్దిపేటకు చెందిన బాలయ్య చిన్నప్పటి నుంచే చిత్రకళపై మక్కువ పెంచుకున్నాడు. మసిబారిన మట్టి గోడలపై కట్టెపుల్లలతో చిత్రాలను గీసిన బాల య్య తెలుగువారు గర్వించదగ్గ చిత్రకళాకారునిగా ఎదిగారు. అంతటి గొప్ప చిత్రకళా ఆధ్యుడు ఇక లేరని తెలుసుకున్న కళాభిమానులు, శిష్యులు, ఆత్మీయులు, ప్రముఖులు చివరి చూపు చూసేందుకు తరలివచ్చారు. ఆయన అంత్యక్రియలు చిన్నకోడూరు మండలం చౌడారం గ్రామంలోని ఆయన వ్యవసాయ క్షేత్రం లో నిర్వహించారు. బాలయ్య మృతితో రాష్ట్రం ఒక గొప్ప చిత్రకారున్ని కోల్పోయిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బాలయ్య కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.